వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం
కరోనా మహమ్మారికి ముకుతాడు వేసే ముక్కు టీకా తయారీ కోసం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఓ కీలక ఒప్పందం కుదుర్చుకొన్నది. కొవిడ్-19 నివారణకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ అభివృద్ధి చేస్తున్న నాసల్ స్ప్రే వ్యాక్సిన్ (ముక్కు ద్వారా ఇచ్చే టీకా)ను భారత్లో తయారు చేసేందుకు భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. ఈ మేరకు డబ్ల్యూయూతో ఒప్పందం చేసుకొని, ముక్కు ద్వారా వేసే టీకా ఉత్పత్తి, పంపిణీ హక్కులు పొందింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి 100 కోట్ల డోసులను చేరుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఈ ముక్కు టీకాను భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. ఎలుకలపై ఈ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు సమచారం.






