ట్విట్టర్లో సమూల మార్పులు..! ఎలాన్ మస్క్ ఉద్దేశమేంటి..?
ఎలాన్ మస్క్ పేరు తెలియనవారుండరు. ఆయన ఏం చేసినా సంచలనమే. టెస్లా కార్లతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఎలాన్ మస్క్ తన సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. స్పేస్ ఎక్స్ తో అంతరిక్షయానానికీ శ్రీకారం చుట్టాడు. ఇప్పుడ డిజిటల్ మీడియాను దున్నేయాలనుకుంటున్నాడు. అందుకే ట్విట్టర్ ను టేకోవర్ చేశాడు. ట్విట్టర్ లో అడుగు పెట్టింది మొదలు ఊచకోత మొదలుపెట్టాడు. సీఈఓపై మొదట వేటు వేసిన మస్క్.. తర్వాత డైరెక్టర్లను తొలగించాడు. టాప్ ఎగ్జిక్యూటివ్ లందరినీ ఇంటికి సాగనంపాడు. ఇప్పుడు ఉద్యోగులపై పడ్డాడు. భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నాడు. దీంతో ట్విట్టర్ నే టేకోవర్ చేయడం వెనుక మస్క్ ఉద్దేశమేంటి.. ఎందుకిలా వ్యవహరిస్తున్నాడనే సందేహాలు మొదలయ్యాయి.
ట్విట్టర్ ను టేకోవర్ చేసిన మొదటి రోజే సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ, సీటీవో లాంటి ఉన్నతోద్యోగులను తొలగించాడు ఎలాన్ మస్క్. ఆ తర్వాత మరికొందరు ఎగ్జిక్యూటివ్ లను, డైరెక్టర్లను ఇంటికి పంపించాడు. దీంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. తమకూ ఆ ముప్పు తప్పదని భయపడ్డారు. వాళ్లు భయపడినట్లే జరుగుతోంది. ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాడు మస్క్. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉంటున్నారు. నష్టాల నుంచి ట్విట్టర్ గట్టెక్కాలంటే ఉద్యోగాల్లో కోత పెట్టడం తప్ప మరో మార్గం లేదనేది మస్క్ మాట. తొలగించిన ఉద్యోగులందరికీ 3 నెలల జీతం ఇస్తున్నట్టు చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగాల్లో సుమారు 50 శాతం కోత విధిస్తున్నట్టు ట్విట్టర్ ఉన్నతోద్యోగి ఒకరు వెల్లడించారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.
ఉద్యోగాల విషయంలోనే కాదు.. ట్విట్టర్ పాలసీలో కూడా మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఎలాన్ మస్క్. ఇప్పటికే బ్లూటిక్ పొందిన వారి నుంచి నెలకు 8 డాలర్ల చొప్పున డబ్బు వసూలు చేయాలని నిర్ణయించారు. త్వరలో ఇలాంటి మరిన్ని మార్పులను కూడా చూడబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో ట్రంప్ పై ట్విట్టర్ నిషేధం విధించింది. అలాంటి వారిపై విధించిన నిషేధాన్ని కూడా మస్క్ ఎత్తేయవచ్చని తెలుస్తోంది. వాక్ స్వాతంత్ర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మస్క్ చెప్తున్నారు. అయితే అది పకడ్బందీగా, నష్పక్షపాతంగా ఉండేలా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. మస్క్ నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నా అతను ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సమర్థించుకుంటున్నారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేశాక పలు అడ్వర్టయిజింగ్ సంస్థలు తమ యాడ్స్ ను ఉపసంహరించుకుంటున్నాయి. త్వరలో పలు ఇతర కంపెనీలు కూడా ట్విట్టర్ నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. కంపెనీలు మాత్రమే కాదు.. పలువురు యూజర్లు కూడా ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తున్నట్టు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మిలియన్ యూజర్లు ట్విట్టర్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. మస్క్ విధానాలను వ్యతిరేకిస్తూ కొందరు, తదుపరి ట్విటర్ పాలసీ ఎలా ఉంటుందోనని మరికొందరు .. ట్విట్టర్ కు వీడ్కోలు పలుకుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ట్విట్టర్ కు భారీ నష్టం తప్పదు. మరి యూజర్లలో విశ్వాసాన్ని మస్క్ ఎలా నెలకొల్పుతారు.. ట్విట్టర్ ను ఎలా కాపాడుకుంటారు.. అనేది వేచి చూడాలి.






