భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ
భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్సిటీ స్థాపనకు అవసరమైన భూమిని సేకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రాథమికంగా వర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏటా 25.52 లక్షల టన్నుల చేపలు, 11.82 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. చేపలు, రొయ్యల సాగులో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే ఈ దిగుబడి మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సాగుకు సంబంధించిన వివిధ కోర్సులను బోధించే యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా సాగు అధికంగా జరుగుతుండటంతో ఈ జిల్లాల రైతులకు భీమవరం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.
ఈ జిల్లాల్లోనే శాస్త్రీయ విధానాలను అనుసరించే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హేచరీస్ నిర్వహణ, ఎగుమతి వ్యాపారాల్లో కొనసాగుతున్నవారు అధికంగా ఉన్నారు. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని భీమవరంలో యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఇతర అధికారులను సీఎం ఆదేశించడంతో చర్యలు ఊపందుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాడే పల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్న గూడెంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించడం పట్ల ఆయా జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






