యాపిల్ ఆన్లైన్ స్టోర్ మొదలైంది..
భారత్లో యాపిల్ ఆన్లైన్ స్టోరును ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదార్లకు నేరుగా తన బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయించనుంది. బుధవారం ప్రారంభమైన ఈ స్టోరు ద్వారా పూర్తి స్థాయి వినియోగదారు సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. అతిపెద్ద రెండో స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారత్లో తన ఆన్లైన్ స్టోరు ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్, యాపిల్ టీవీ వంటి అన్ని ఉత్పత్తులను విక్రయించనుంది. ఇటీవల విడుదల చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, వాచ్ ఎస్ఈలను కూడా అందుబాటులో ఉంచింది. భౌతిక స్టోర్లలో ఉన్న ధరలే ఇందులోనూ ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తన ఉత్పత్తులపై ఎక్సెండెడ్ వారెంటీ అందించే యాపిల్కేర్+ను సైతం వినియోగదార్లు కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఆంగ్ల, హిందీలలో వినియోగదారు సేవలు అందించనుంది.






