ఫార్చ్యూన్ జాబితాలో అంబానీ వారసులు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కవల పిల్లలైన ఇషా, ఆకాశ్ పిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 40 ఏండ్లలోపు వ్యక్తులతో ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన టాప్-40 జాబితాలో వీరు తొలిసారి చోటు దక్కించుకున్నారు. వీరితోపాటు సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, ప్రముఖ విద్యారంగ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్కూ ఈ జాబితాలో చోటు లభించింది.
కరోనా మహమ్మారి ప్రజల పనితీరును సమూలంగా మార్చివేసిందని, వ్యాపార నిర్వహణలో తీవ్ర సవాళ్లతో పోరాడుతూనే ఉద్యోగులకు చేయూతనిచ్చి సాధికారత కల్పించేందుకు పలువురు ఎగ్జిక్యూటివ్‌లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ఫార్చ్యూన్ పేర్కొన్నది. ఈ మార్పును ప్రతిబింబించేలా ఈ ఏడాది ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో టాప్-40 అండర్-40 జాబితా ను సవరించి టెక్నాలజీ విభాగంలో ఇషా, ఆకాశ్, రవీంద్రన్.. హెల్త్‌కేర్‌లో పూనావాలాకు చోటు కల్పించామని ఆ పత్రిక వివరించింది.






