తెలుగు రాష్ట్రాల్లో అదానీ డేటా కేంద్రాలు
తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహించేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్, అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్ (ఈసీఎక్స్)తో సమాన భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అదానీ ఎంటర్ప్రైజ్ స్టాక్ఎక్స్చేంజీలకు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా అదానీ యాజమాన్యంలో ఉన్న డీసీ డెవలప్మెంట్ చెన్నై (డీసీడీసీపీఎల్)లో 50 శాతం వాటాలను ఈసీఎక్స్ యూరప్ విభాగానికి విక్రయించనుంది. ఈ ఉమ్మడి భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా రానున్న పదేళ్లలో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని వివరించింది.
చెన్నైతో ప్రారంభించి నవీ ముంబయి, నోయిడా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు ఈ ఒప్పందాన్ని విస్తరించనున్నాయి. డేటా కేంద్రాల నిర్మాణం, అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్లు సంస్థలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా అదానీకనెక్స్ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.






