వాట్సాప్ ను ఎంత మంది డిలీట్ చేశారో తెలుసా?
ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నామని చెప్పిన తర్వాత ఆ యాప్‌పై ఇండియన్స్ లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్ద ఎత్తున యూజర్లు ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్, టెలిగ్రామ్‌ల వైపు వెళ్లారు. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన తర్వాత ఎంత మంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్ చేశారో తెలుసుకోవడానికి లోకల్ సర్కిల్స్ ఓ సర్వే చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఆన్లైన్ సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 17 వేల మంది పాల్గొన్నారు.
ఇప్పటి వరకూ ఈ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటన తర్వాత 5 శాతం మంది భారతీయులు వాట్సాప్‌ను డిలీట్ చేసినట్లు ఈ సర్వే తేల్చింది. ఇండియాలో మొత్తం వాట్సాప్ యూజర్ల సంఖ్య 40 కోట్లు కాగా ఈ లెక్కన సుమారు 2 కోట్ల మంది తమ వాట్సాప్ అకౌంట్‌ను డిలీట్ చేశారని అనుకోవచ్చు. ఇక 21 శాతం మంది తాము వాట్సాప్ వాడకాన్ని తగ్గించి.. ప్రత్యామ్నాయ యాప్‌లను యాక్టివ్‌గా వాడుతున్నట్లు ఈ సర్వేలో చెప్పారు. మరో 22 శాతం మంది తాము వాట్సాప్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేసినట్లు వెల్లడించారు.






