Student visa : డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం .. విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్

అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించిన విదేశీ విద్యార్థుల వీసా(Student visa) ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈ రోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్ మీడియా (Social media) అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించనున్నారు.
ఎఫ్, ఎం, జే కేటగిరి దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు. అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్ మీడియా ప్రోఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూల (Interviews) దాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది.