Donald Trump: భారత్-పాక్ అణుయుద్ధం మేమే ఆపాం : ట్రంప్

భారత పాకిస్థాన్‌ల మధ్య అణు యుద్ధాన్ని తన యంత్రాంగం నిలువరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చాటుకున్నారు. ముందుగా యుద్ధాన్ని ఆపితే అమెరికా బోలెడు వాణిజ్యం చేస్తుందని ఇరు దేశాలకూ చెప్పినట్టు ట్రంప్ తెలిపారు. భారత్ -పాకిస్థాన్ (India – Pakistan)ల మద్య తక్షణ కాల్పుల విరమణకు నా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. ఇరుదేశాల మధ్య ఈ కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా. అణ్వస్త్రాలు కలిగివున్న ఈ దేశాల మధ్య ప్రమాదకరమైన ఘర్షణను అంతం చేశాం. అణు యుద్ధం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న రెండు దేశాలను విరమింపజేశాం అని ట్రంప్ అన్నారు. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) (Director General of Military Operations)లు తమంత తాముగా అవగాహనకు వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో ఆయన మరోసారి ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.