Seattle : పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత

జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సియాటిల్ లోని ఫెడరల్ కోర్టు (Seattle Federal Court)జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేఎస్ లా జన్మత పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయీ, ఓరేగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ (John C. Kaffner )ఈ రూలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఇటీవలి వరకూ ఉండేది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు. దీనిపై డెమోక్రాట్లు (Democrats) అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిలో ఫెడరల్ జడ్జి ఈ తీర్పు చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. 14 రోజులపాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నానని ప్రకటించారు.