Golden Dome: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. రూ.15 లక్షల కోట్లతో

అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా గోల్డెన్ డోమ్ (Golden Dome) అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అమెరికా శ్రీకారం చుట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ శ్వేత సౌధం (White House)లో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ (Israel)ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.15 లక్షల కోట్లు) ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీస్ (Michael Guttlis) ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారు. ఇది తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ తెలిపారు.