Donald Trump: ట్రంప్ కొత్త ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’.. భారత్-పాక్ యుద్ధం ఆపానని మళ్లీ ప్రకటన!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’ డాక్యుమెంట్లో మరోసారి వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. ట్రంప్ స్వయంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య శాంతిని మధ్యవర్తిత్వం వహించి, అణు యుద్ధం జరగకుండా ఆపారని ఈ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అయితే ద్వైపాక్షిక అంశాల్లో థర్డ్-పార్టీ జోక్యాన్ని అంగీకరించబోమని న్యూఢిల్లీ ఇప్పటికే ఈ వాదనను పలుమార్లు ఖండించింది.
ట్రంప్ (Donald Trump) సంతకం చేసి విడుదల చేసిన 33 పేజీల ఈ డాక్యుమెంట్.. మే 10న భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చిన ఘనతను అమెరికా అధ్యక్షుడికే ఇచ్చింది. ఇస్లామాబాద్, న్యూఢిల్లీల మధ్య శాంతి ఒప్పందంతో సహా మొత్తం ఎనిమిది ప్రపంచ వివాదాలలో తాను పురోగతి సాధించినట్లు పేర్కొంటూ, ట్రంప్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ పీస్’గా అభివర్ణించింది.
ఈ యూఎస్ వ్యూహాత్మక పత్రం భారత్‌ను అమెరికా ఇండో-పసిఫిక్ ప్రణాళికలలో కేంద్ర స్థానంలో ఉంచింది. ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించే అవకాశం ఉన్న దక్షిణ చైనా సముద్రంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ కూటమిలో న్యూఢిల్లీతో సహకారాన్ని కొనసాగించడం చాలా అవసరమని ఈ నివేదిక ఉద్ఘాటించింది.






