Gaza clean: గాజా బాధితులపై ట్రంప్ ఫోకస్…ఈజిప్ట్, జోర్డాన్ అధినేతలకు ఫోన్‌కాల్

ఇజ్రాయెల్(Israel) చేపట్టిన భీకర దాడులతో గాజా తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 95 శాతం భవనాలు నేలమట్టమయ్యాయి. ఉన్న భవనాలు కూడా నేడో,రేపో కుప్పకూలే పరిస్థితులున్నాయి. పెద్దఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడంతో లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందంతో వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లు పునరావాసం కల్పించాలన్నారు. ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
‘‘గాజా ప్రాంతం శిథిలాల కుప్పగా మారింది. అక్కడున్న ప్రతీది నాశనమైంది. ప్రజలు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలతో కలిసి వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నా. అక్కడ వారు శాంతియుతంగా జీవించవచ్చు. ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు.. లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈజిప్టు అధ్యక్షుడితోనూ దీనిపై చర్చిస్తానని తెలిపారు. ఈజిప్టు(Egypt), జోర్డాన్(Jordan)లు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. జోర్డాన్‌లో ఇప్పటికే దాదాపు 24 లక్షలమంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనాల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ‘ద్విదేశ పరిష్కార’మే మార్గమని అమెరికా దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. హమాస్, పాలస్తీనీయులు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘‘గాజావాసులు 15 నెలలపాటు విధ్వంసాన్ని, మారణకాండను భరించారు. కానీ, వారు ఎక్కడికీ వెళ్లలేదు. పునర్నిర్మాణం పేరిట ట్రంప్ ప్రతిపాదనలు మంచి ఉద్దేశంగా కనిపించినప్పటికీ.. స్థానికులు ఇటువంటి పరిష్కారాలను అంగీకరించరు’’ అని హమాస్(Hamas) ప్రతినిధులు తెలిపారు.
ఏదేమైనా అమెరికా..ఈ విషయంలో ఓ సూచన చేయడం .. గాజా విషయంలో శుభసూచిక లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే నిలువెల్లా గాయాలతో నెత్తురోడిన గాజా వాసులకు.. ఇది కాస్త ఉపశమనంగా భావించవచ్చు. అయితే … ఇదే వంకతో తమను అక్కడ నుంచి తరలించేందుకు అమెరికా ప్లాన్ చేస్తుందన్న భావన.. పాలస్తీనా వాసుల్లో కలిగితే మాత్రం .. సమస్య మరింత జఠిలమవుతుంది.