Donald Trump : భారతీయ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా అమెరికా ఆంక్షలు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రిక్తతలను పెంచిన వేళ భారత్ (India) కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదురుకానున్నది. అమెరికా వర్క్ వీసా (Work visa) లపై ట్రంప్ ఇక దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాలోని జాబ్ మార్కెట్ భారత్‌కు ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా టెక్ ప్రొఫెషనల్స్‌కు అమెరికాలో ఉద్యోగావకాశాలు అధికంగా లభించాయి. మారిన రాజకీయ పరిస్థితులలో అమెరికన్ వర్క్ వీసాలపై ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన ఏర్పడింది. అమెరికా వర్క్ వీసాలు ప్రత్యేకంగా హెచ్-1బీ వీసా (H-1B visa) లలో భారత్‌కే అగ్రవాటా లభిస్తూ వస్తోంది. అమెరికాకు చెందిన 25,000 కోట్ల డాలర్ల ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీని ఆధారం చేసుకుని అనేక భారతీయ ఐటీ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. అయితే భారతీయుల (Indians) రాకతో అమెరికన్ల ఉద్యోగాలకు కోత పడుతోందన్న విమర్శలతో వర్క్ పర్మిట్లపై ట్రంప్ ఇక దృష్టి పెడతారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.






