Grok AI: దిగొచ్చిన ఎక్స్.. భారత్ నోటీసులతో 600 అకౌంట్లు బ్లాక్
భారత ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడికి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ తలవంచింది. ఈ ప్లాట్‌ఫాంలో తెచ్చిన గ్రోక్ ఏఐ (Grok AI)ను ఉపయోగించి అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ తయారు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశాల మేరకు, ఎక్స్ యాజమాన్యం భారీ ఎత్తున తమ ప్లాట్‌ఫాంలో ప్రక్షాళన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతదేశంలో ఏకంగా 3,500కు పైగా అభ్యంతరకర పోస్టులను లేదా లింక్‌లను బ్లాక్ చేసింది. అలాగే నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్న దాదాపు 600 ఖాతాలను శాశ్వతంగా తొలగించింది.
ఎక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘గ్రోక్’ (Grok AI)ను ఉపయోగించి కొందరు మహిళల గౌరవానికి భంగం కలిగించే చిత్రాలను (Deepfakes) సృష్టిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై జనవరి 2న ఎక్స్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో దిగివచ్చిన ఎక్స్.. తమ ప్లాట్ఫామ్లో కంటెంట్ మోడరేషన్‌ను (Grok AI) మరింత కఠినతరం చేస్తామని హామీ ఇచ్చింది. భారతీయ ఐటీ చట్టం 2000, ఐటీ రూల్స్ 2021కి లోబడి నడుచుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొంది. సోషల్ మీడియాలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.






