Probationary : ప్రొబేషనరీ సిబ్బందికి ట్రంప్ ఎసరు

ప్రొబేషన్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ సాగనంపాలని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) సర్కారు ఆదేశించింది. దీంతో ఏడాది కాలం ప్రొబేషన్‌లో ఉండి ఇంకా పర్మనెంట్ కాని లక్షల మంది ఉద్యోగులపై వేటు పడనున్నది. నిరుడు మార్చి నాటికి ఏడాదికన్నా తక్కువ కాలం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రొబేషనరీ (Probationary) ఉద్యోగుల సంఖ్య 2,20,000. విద్యా శాఖలో వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ సంస్థలో ప్రొబేషనరీ ఉద్యోగులకు ఉద్వాసన ఈ వారమే మొదలైంది. వృద్ధ పౌరులకు క్యాన్సర్ చికిత్స, మాదక ద్రవ్య వ్యసనాన్ని మాన్పించడం వంటి కార్యక్రమాలలో నిమగ్నమైన పరిశోధక సిబ్బందినీ సాగనంపుతున్నారు. అమెరికా(America) లో రక్షణ, పోస్టల్ (Postal) సిబ్బంది మినహా మొత్తం ఫెడరల్ (Federal) ప్రభుత్వ సిబ్బంది సంఖ్య 24 లక్షలు. వారు సెప్టెంబరు 30 కల్లా రాజీనామా చేస్తే తగు పరిహారం చెల్లిస్తామని అమెరికా సర్కారు ప్రతిపాదించింది. ఇంతవరకు 75,000 మంది ఉద్యోగులు రాజీనామాకు సుముఖత తెలిపారు.