Donald Trump : ఉద్యోగం వదులుకుంటే 8 నెలల జీతం

అమెరికాలో ప్రభుత్వోద్యోగుల సంఖ్యను కుదించే దిశగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 6లోగా స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్దమయ్యే వారికి 8 నెలల జీతం ఇస్తామని ప్రతిపాదించింది. ఈ మేరకు 20 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు( Government employees) ఈమెయిల్ పంపినట్లు అమెరికా ప్రభుత్వ సామర్థ్య పెంపుదల శాఖ (డోజ్) సలహాబోర్డు సభ్యురాలు కేటీ మిల్లర్ (Katie Miller) తెలిపారు. అమెరికా ఫెడరల్ (సమాఖ్య) ప్రభుత్వంలో ప్రస్తుతం సుమారు 30 లక్షల మంది ఉద్యోగులున్నారు. దేశంలోని మొత్తం ఉద్యోగవర్గ సంఖ్యలో ఇది 1.9 శాతం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ (Pew Research Center) తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కొద్ది శాతం మంది ఉద్యోగులు కొలువును వదులుకున్నా అది పెను సంచలనమే కానుంది.
దీనివల్ల హఠాత్తుగా ఏర్పడే సిబ్బంది కొరతతో ఫెడరల్ ప్రభుత్వ సేవలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వానికి చెందిన సిబ్బంది నిర్వహణ కార్యాలయం ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఓ మెమో విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగులంతా మెరుగైన పనితీరు, ఉత్తమ ప్రవర్తన కనబర్చేలా చూస్తామని అందులో పేర్కొంది. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల కుదింపు గురించి పరోక్ష హెచ్చరిక చేసింది.