Donald Trump : ట్రంప్ దూకుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా?

అమెరికా అధ్యక్షునిగా అధికార పగ్గాలు చేపట్టిన ఒక వారం కూడా గడవకనే ట్రంప్ (Trump) తన అధికారులను విస్తృతం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన చేపడుతున్న చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫెడరల్ గ్రాంట్లపై ఆధారపడే అనేక శాఖల నిధుల్ని నిలిపివేయాలని ఈ వారంలో ఆయన ఇచ్చిన ఆదేశాలు సంచలనం సృష్టించాయి. అవి అమలైతే పోలీసు(Police) శాఖకు, గృహ హింస రక్షణ శిబిరాలకు, పోషకాహార సేవల శాఖకు చెల్లించాల్సిన ట్రిలియన్ల డాలర్ల నిధులు నిలిచిపోయేవి. అయితే ఆయన ఆదేశాలను ఒక ఫెడరల్ కోర్టు (Federal Court) నిలువరించడంతో ఆ పరిస్థితి తప్పింది. పార్లమెంటు (Parliament) అనుమతించిన ఖర్చులకు కేటాయించిన నిధుల్ని నిలిపే అధికారం దేశాధ్యక్షునికి లేదని న్యాయ నిపుణులు (Legal experts) వాదిస్తున్నారు. ట్రంప్ చర్యలు దేశాధ్యక్షుని అధికారులకు, కాంగ్రెస్ ప్రత్యేక అధికారాలకు మధ్య ఉన్న స్పష్టమైన విభజన రేఖను చెరిపేసేందుకు ఉద్దేశించినట్టున్నాయని నిపుణులు అంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రభుత్వ నిధుల వ్యయాన్ని అనుమతించే అధికారాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ఆమోదించిన మేరకు కార్యనిర్వాహక వ్యవస్థ నిధుల్ని కేటాయించాల్సి ఉంటుంది.