UNHRC :యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి ట్రంప్ గుడ్‌బై

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) (UNHRC) కూడా గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిలువరించి అంతర్జాతీయంగా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస(United Nations) స్థాపనకు అమెరికా సాయపడిరది. కానీ ఐరాసకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా సంస్థ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తున్నాయి. పైగా అమెరికా ప్రయోజనాలనే దెబ్బ తీస్తున్నాయి అంటూ ఉత్తర్వుల్లో తూర్పారబట్టారు. పాలస్తీనా శరణార్థులకు ఆ సంస్థ అందిస్తున్న సాయానికి అమెరికా నిధుల సాయాన్ని తక్షణం నిలిపేయాల్సిందిగా కూడా ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యూనెస్కో) పాలస్తీనా శరణార్థుల సహాయ, పనుల సంస్థ ( యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ)ల్లో కొనసాగడం అవసరమా పరిశీలించాల్సిందిగా కూడా అధికారులకు సూచించారు.