Donald Trump : భారత్‌పై ఆంక్షలు.. రష్యాకు పెద్ద దెబ్బ : ట్రంప్

భారత్‌పై తాము విధించిన టారిఫ్‌ల భారం రష్యాకు పెద్ద దెబ్బ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా (Russia) ఆర్థిక వ్యవస్థ పెద్ద బాగోలేదని, అక్కడి నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ (India )పై వేసిన సుంకాలు రష్యాని మరింత దెబ్బతీశాయని చెప్పారు. రష్యా తమ దేశాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుంది. అది చాలా పెద్దదేశం. రాణించడానికి అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాత్రం అది మా నిర్ణయంతో ఎంతో ప్రభావితం కానుంది. వారివద్ద నుంచి అత్యధికంగా చమురు కొనే దేశం ( భారత్)పై 50 శాతం టారిఫ్ వేస్తానని నేను చెప్పాను. అది వారికి శరాఘాతం. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) అమెరికా పర్యటనకు రానుండటంతో ఎంతో గౌరవప్రదంగా భావిస్తున్నా. నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతున్నాయని అనుకుంటున్నా అని సమావేశం తర్వాత ఐరోపా నాయకులతోనూ మాట్లాడతా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky), పుతిన్ మధ్య సమావేశం జరగవచ్చు. ఆ ఇద్దరూ చర్చించుకునే వేదిక ఉండాలని నేను భావిస్తున్నాను. వారు అవసరమనుకుంటే నేను కూడా చర్చలో పాల్గొంటాను. భారత్`పాక్ ఘర్షణతో సహా ఐదు యుద్ధాలను నేను ఆపగలిగాను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంచి సంబంధాలున్నాయి అని ట్రంప్ తెలిపారు.