J.D. Vance: ఈ నెల 21న ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) ఈ నెల 21న భారత్ పర్యటనకు రానున్నారు. తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ (Usha Vance), పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్ లతో కలిసి ఆయన 24వ తేదీ వరకు అనధికారికంగా దేశంలో పర్యటిస్తారు. ఆయనది పూర్తిగా ప్రైవేటు పర్యటనే అయినా, ప్రధాని మోదీ (Prime Minister Modi)తో 21న భేటీ కానున్నారు. సుంకాలతోపాటు ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశముందని వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వాన్స్ పర్యటన వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా ప్రకటించింది. భారత పర్యటనలో భాగంగా తన కుటుంబంతో కలిసి ఢిల్లీ, ఆగ్రా, జైపుర్‌లను వాన్స్ సందర్శిస్తారు. భారత్‌కు వచ్చీ రాగానే వాన్స్ దంపతులు ఢిల్లీలోని ఎర్ర కోట (Red Fort) సందర్శనకు వెళ్తారు.