కాల్పుల విరమణ కుదిరితేనే.. ఇరాన్ శాంతిస్తుంది : బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే ఇరాన్ తన ప్రతీకార దాడిని అపొచ్చని అమరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అయితే చర్చలు విజయవంతమవ్వడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈజిప్టు లేదా ఖతార్‌లో చర్చలు ప్రారంభమవ్వనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనబోమని ఇప్పటికే హమాస్ స్పష్టం చేసింది. హమాస్‌ను ఖతార్ ఒప్పిస్తుందని ఈజిప్టు, అమెరికా భావిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో సంయమనం పాటించాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ చేసిన విజ్ఞప్తిని ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియె హత్య అనంతరం ఇజ్రాయెల్`ఇరాన్ మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హనియో హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 20 బిలియన్ డాలర్ల ఆయుధాలు ఇజ్రాయెల్ సరఫరా చేసే ఒప్పందానికి అమెరికా పచ్చజెండా ఊపింది. ఇందులో ఉపరితలం నుంచి ఉపరితలంలోకి దూసుకెళ్లే క్షిపణులు ఉన్నాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఐదుగురు చిన్నారుల సహా 17 మంది మృతి చెందారు.






