Trump: వారిని విడిచిపెట్టకపోతే నరకం చూపిస్తా : ట్రంప్ హెచ్చరిక
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తమ చెరవలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల హమాస్ (Hamas) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మిలిటెంట్ సంస్థపై విరుచుకుపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పలడేవారికి నరకం చూపిస్తాం. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి అని హెచ్చరించారు.






