Gaza: అక్కడ నిజంగానే కరువుంది.. నెతన్యాహూతో ఏకీభవించను : ట్రంప్

గాజాలో కరువు పరిస్థితులున్న విషయం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ (Netanyahu ) చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో, అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం అని స్కాట్లాండ్ (Scotland) లో పర్యటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ (Israel) హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమయంలో చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని విడుదల చేయడం లేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.