Gaza :గాజాను సొంతం చేసుకుంటాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధ కల్లోలిత గాజా (Gaza) స్ట్రిప్‌ను తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ట్రంప్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరూ శ్వేతసౌధంలో సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా (America) బాధ్యత తీసుకుని, దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పాలస్తీనియన్లు వేరేచోట స్థిరపడిన తర్వాత గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ ఇజ్రాయెల్ (Israel )అమర్చిన ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను తీసుకుంటుంది. దాడుల వల్ల అక్కడ నామరూపాల్లేకుండా ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తుంది. కాంక్రీటు శిథిలాల కింద అక్కడ ప్రజలు ఉంటున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు లభించేలా చూడవచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు.