Donald Trump : అదే జరిగితే మాత్రం రష్యా పతనం ..డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ (Vladimir Putin)ను ఎప్పుడూ వెనకేసుకొచ్చే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వరం మారింది. ఉక్రెయిన్ (Ukraine) పై గత కొన్ని రోజులుగా రష్యా (Russia) భీకరంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో పుతిన్ వ్యవహారశైలిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా భారీ సంఖ్యలో ప్రజలను హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదన్న ట్రంప్, ఉక్రెయిన్ మొత్తాన్ని పుతిన్ కబళించాలని చూస్తున్నారని పేర్కొనడం గమనార్హం. పుతిన్‌తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనకు ఏదో జరిగింది. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా చాలా మంది ప్రజలను హతమారుస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఉక్రెయిన్‌లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్ల (Drones)ను ప్రయోగిస్తున్నారు. ఆయనకు ఉక్రెయిన్ అంతా కావాలి. అదే జరిగితే మాత్రం రష్యా పతనం ప్రారంభమవుతుంది అని ట్రంప్ హెచ్చరించారు.