జనరేషన్ జీను ఆకట్టుకునేందుకు ..ఓ సీక్రెట్ వెపన్ : ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో జనరేషన్ జీ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో 41 మిలియన్ల మంది యువ ఓటర్లపై అభ్యర్థులు ప్రధానంగా దృషి సారించారు. సోషల్ ఇన్ఫ్లు యెన్సర్లతో వీరిని ఆకట్టుకునేందుకు కమలా హారిస్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనరేషన్ జీను ఆకట్టుకునేందుకు తన వద్ద ఓ సీక్రెట్ వెపన్ ఉందన్నారు. మరి ఆయన చెప్పిన సీక్రెట్ వెపన్ ఎవరంటే స్వయానా ఆయన కుమారుడు బారన్ ట్రంప్. ఈ ఎన్నికల్లో తన 17 ఏళ్ల కుమారుడే తనకు ట్రంప్ కార్డ్ అని అంటున్నారు మాజీ అధ్యక్షుడు ట్రంప్. తన సీక్రెట్ వెపన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బారన్ ఓ మంచి కుర్రాడు. నా దృష్టిలో అతడు ఎప్పటికీ చిన్న పిల్లాడే. నా కుమారుడు ఓ మంచి అథ్లెట్. చాలా తెలివైన వ్యక్తి. ప్రజల దృష్టిని ఆకర్షించాడు. యువతను ఆకట్టుకోవడం ఎలాగో అతడికి బాగా తెలుసు. జనరేషన్ జీ ఓటర్ల విషయంలో మేం విజయం సాధించినట్లే అని ట్రంప్ చెప్పారు. ట్రంప్, మెలానియాల కుమారుడైన బారన్ కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నాడు.






