Epstein: ట్రంప్‌నకు మెలానియాను ఎప్‌స్టీన్ పరిచయం చేశాడా!

సెక్స్ కుంభకోణంలో దోషిగా నిరూపితమై జైలుశిక్ష అనుభవించిన జెఫ్రీ ఎప్‌స్టీనే.. మెలానియా (Melania)ను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు పరిచయం చేశాడని వైఖేల్ వోల్ఫ్ (Wychel Wolf) చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ట్రంప్ జీవిత చరిత్రపై పుస్తకాలు రాసిన వోల్ఫ్ మాట్లాడుతూ ఎప్‌స్టీన్ సోషల్ సర్కిల్‌లో మెలానియా ఉన్నారని, ఆ క్రమంలోనే ట్రంప్‌నకు ఆమెను ఎప్‌స్టీన్ పరిచయం చేశాడని పేర్కొన్నారు. మెలానియా మాత్రం 1998లో తాను, ట్రంప్ ఓ పార్టీలో కలిశామని, తర్వాత ఇద్దరం వివాహం (Marriage) చేసుకున్నామని తెలిపారు. మైనర్లతో లైంగిక కార్యకలాపాలు సాగించారన్న కేసులో దోషిగా తేలిన ఎప్‌స్టీన్‌కు న్యాయస్థానం జైలు శిక్ష కూడా విధించింది. ఆయన కారాగారంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన దస్త్రాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు కూడా ఉందన్న వార్తలు ఇటీవల కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో మెలానియాను ట్రంప్ నకు ఎప్‌స్టీనే పరిచయం చేశాడన్న వోల్ఫ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.