వలసదారుల పిల్లల్లో భయం భయం!
డొనాల్డ్ ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అక్రమంగా వలస వచ్చిన తమ తల్లిదండ్రులను దేశం నుంచి తరిమేస్తారనే భయంతో పాఠశాల విద్యార్థులు వణికిపోయారు. వలస వ్యవహారాల అధికారులు పాఠశాలలకు వచ్చి తమను తీసుకెళ్లిపోతారనే భయంతో ఇళ్లలోనే దాక్కున్నారు. వారిని స్కూళ్లకు రప్పించడానికి పాఠశాల సిబ్బంది నానా తంటాలు పడ్డారు. అప్పట్లో వలసదారుల పిల్లలు భయపడినట్లు జరగకపోయినా ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ తమను తప్పకుండా వెళ్లగొడతారనే ఆందోళన అక్రమ వలసదారుల్లో పెరుగుతోంది. లక్షల మంది అక్రమ వలసదారులను సైన్యం, పోలీసులను ఉపయోగించి వెళ్లగొడతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
అయితే వలస అధికారులు పాఠశాలలకు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలకు వచ్చి విద్యార్థులనుగానీ, వారి తల్లిదండ్రులనుగానీ అరెస్టు చేయకూడదని 2011 నుంచి ఒక విధానం అమలవుతోంది. ఈ విధానాన్ని రద్దు చేయాలని హెరిటేజ్ ఫౌండేషన్ ట్రంప్ సర్కారుకు ప్రతిపాదిస్తోంది. ట్రంప్ దీనిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించకపోయినా వలసదారుల బహిష్కారాన్ని బలపరిచే వారిని కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇకపై ఏదైనా స్కూలులో తమ పిల్లలను దింపడానికి వచ్చిన తల్లిదండ్రులను అరెస్టు చేస్తే ఆ వార్త ఆమెరికా అంతటా దావానలంలా వ్యాపించి భయాందోళనలు చెలరేగుతాయి. మెక్సికో, మధ్య అమెరికా దేశాల నుంచి వలస వచ్చినవారు ఇలాంటి అవాంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి న్యాయవాదుల సలహా సంప్రదింపులు తీసుకోవాలని అనేక పాఠశాలలు నిశ్చయించాయి. భయవిహ్వల వాతావరణంలో పిల్లల చదువు ఎలా సాగుతుందనేది ప్రశ్న. చివరకు ట్రంప్ ఏం చేస్తారో ఎవరూ ఊహించలేకున్నారు.






