America : ఉక్రెయిన్, అమెరికా మధ్య కీలక ఒప్పందం!

ఉక్రెయిన్ లోని అత్యంత అరుదైన, విలువైన ఖనిజ సంపదపై హక్కులు ధారాదత్తం చేయాలని అమెరికా (America) చేస్తున్న డిమాండ్ తీరేలా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఒప్పందంపై ఉక్రెయిన్, అమెరికా సంతకాలు చేయనున్నట్లు తెలిసింది. వాషింగ్టన్ (Washington)లో ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాపై సంతకాలు జరిగే వీలుంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఉక్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి యులియా సిరిడెంకో(Yulia Syridenko) ముసాయిదా ఒప్పందంలోని సాంకేతిక అంశాలను ఖరారు చేసేందుకు ట్రంప్ పాలకవర్గంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా రష్యాతో యుద్ధంలో బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక, ఆయుధ సాయం చేసినందుకు, ఇకమీదటా సాయం చేయబోతున్నందుకు ప్రతిగా తమకు విలువైన ఖనిజాలు (Minerals) ఇవ్వాలని ఉక్రెయిన్‌ను ట్రంప్ కోరడం తెలిస్సిందే. అరుదైన ఖనిజాల డీల్ కుదిరాక, యుద్ధంలో రష్యాకు ఎదురునిలబడి అమెరికా తమకు ఏ మేరకు అండగా నిలబడుతుందనే అనుమానాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మదిలో అలాగే ఉన్నాయి.