Abroad :విదేశాలకు రూ.10 లక్షలకు మించి డబ్బులు పంపితేనే.. ఇక నుంచి

విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న వారికి పెద్ద ఊరట. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, పెట్టుబడుల నిమిత్తం భారత్ (India) నుంచి విదేశాలకు పంపే డబ్బులపై మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్) చేసే పరిమితిని పెంచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి డబ్బులు పంపితేనే ఇక నుంచి టీసీఎస్ (TCS) ఉంటుంది. ఆర్‌బీఐ (RBI) లిబర్‌లైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ( ఎల్‌ఆర్‌ఎస్) కింద ఇంతకు మునుపు ఈ పరిమితి రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని పెంచుతూ బడ్జెట్లో (Budget) ప్రతిపాదించారు. విదేశాలకు పంపించే చిన్న మొత్తం లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి పంపితే, ఆ డబ్బులు ఏ అవసరానికి పంపించారో, వాటి ఆధారంగా టీసీఎస్ రేట్లు వర్తిసాయి. వైద్య అవసరాల కోసమైతే 5శాతం, విదేశీ పెట్టుబడులు, ప్రయాణాలకైతే 20 శాతంగా ఇవి ఉండనున్నాయి. విద్యా అవసరాల కోసం పంపించే నిధులకు టీసీఎస్ తీసేశారు. ఏదేని ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకుని, ఈ డబ్బులను పంపిస్తుండటమే ఇందుకు కారణం. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న లేదా నిర్వహిస్తున్న దేశీయ సంస్థకు సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయుల (Non-Resident Indians )కోసం ఊహాత్మక (ప్రిజంప్టిన్) పన్ను విధానాన్ని కూడా ప్రతిపాదించారు.