TTD: వైకుంఠ దర్శనాలు రెండు రోజులకు కుదిస్తారా? తిరుమల భక్తులలో ఆందోళన..
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనాల వ్యవధిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అన్నమయ్య భవన్లో (Annamayya Bhavan) జరుగుతున్న టీటీడీ (TTD) పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టికెట్ల జారీ సమయంలో తిరుపతిలో (Tirupati) భారీ గందరగోళం నెలకొని, ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం అందరినీ కలచివేసింది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి దర్శనాలను రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్ణయంపై వైసీపీ (YCP) నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్రంగా స్పందించారు. వైకుంఠ దర్శనాలను రెండు రోజులకు మాత్రమే కుదించడం దైవ ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 మంది పీఠాధిపతులు, వైఖానస ఆగమ పండితులు, 32 మంది ఆధ్యాత్మిక ప్రముఖుల సూచనలతో 10 రోజులపాటు వైకుంఠ దర్శనాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో సుమారు 10 లక్షల మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం పొందారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు (B.R. Naidu) వైకుంఠ ద్వార దర్శనాలను రెండు రోజులకు పరిమితం చేయాలనే ఆలోచనను ముందుకు తీసుకువస్తున్నారని, దానికి ‘ద్రావిడ సంస్కృతి’ అనడం అనవసర వాదమని భూమన విమర్శించారు. వైకుంఠ దర్శనం 10 రోజులపాటు కొనసాగితేనే భక్తులకు సౌలభ్యం కలుగుతుందని, అది సనాతన సంప్రదాయాలకు అనుగుణమని అన్నారు.
ఇక ఈ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బీజేపీ (BJP), జనసేన (Janasena) భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రభుత్వం వైకుంఠ దర్శనాలను రెండు రోజులకు మాత్రమే కుదిస్తే, అది హిందూ భక్తుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందూ సంప్రదాయాలను కాపాడే బాధ్యత ఉన్న ప్రభుత్వమే భక్తుల ఆశలపై నీళ్లు చల్లుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక టోకెన్ జారీ వ్యవహారంలో జరిగిన వైఫల్యం మళ్లీ పునరావృతమవుతుందనే భయం కూడా భక్తుల్లో ఉంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల కారణంగా టీటీడీ నిర్వాహణపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ అనుభవాల తర్వాత కూడా వైకుంఠ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేయడం భక్తులకు అంగీకారయోగ్యం కాదని భావిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా హిందువుల దృష్టిని ఆకర్షించింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ 10 రోజుల వైకుంఠ దర్శనాలను కొనసాగిస్తారా? లేక రెండు రోజులకు పరిమితం చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం తిరుమల ఆలయ పరంపరపైనా, ప్రభుత్వం ప్రతిష్టపైనా పెద్ద ప్రభావం చూపనుంది.







