Tirumala: తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసి) ఏర్పాటు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల (Tirumala) కు వస్తుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చే తిరుమల క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు సమగ్రమైన సేవలు అందించేందుకు టిటిడి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మరింతగా భక్తలకు సౌకర్యాలను కల్పించే దిశగా, అదేవిధంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అమెరికాలోని ఎన్నారైల దాతృత్వంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను తిరుమలలో అందుబాటులోకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ తీసుకువచ్చింది. దేశంలోనే తొలిసారిగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఏఐ సేవలలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటి, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు బే ఏరియాలో ఉన్న తెలుగు ఐటీ ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న వేజెళ్ళ, ఇతర ఎన్నారైలు తిరుమలలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ సిస్టమ్ గురించి వివరించారు. తిరుమలలో ఈ ఏఐ టెక్నాలజీపై ఫిబ్రవరిలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తిగా డొనేషన్ ప్రాతిపదికగా తామే దీనిని స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. అనంతరం వారు టిటిడితో ఒప్పందం చేసుకున్నారు.
తిరుమల క్షేత్రంలో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ స్థానంలో సుమారు 30 కోట్లతో అత్యాధునిక పద్ధతుల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టిటిడిలో దీన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్‌ఆర్‌ఎల దాతృత్వంతో తిరుమల వైకుంఠం-1లో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనిద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, తదితర సౌకర్యాలకు అనుగుణంగా భద్రతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సిసిటీవి ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25మందికి పైగా సాంకేతిక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుండే భక్తుల రద్దీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు. ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తుల పరిస్థితి ఏమిటి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నేషన్ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయినవారు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తుంది.
భక్తుల ముఖకదలికలు ఆధారంగా వారి ఇబ్బందులను తెలియజేస్తుంది. క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడి మ్యాప్ చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాలను రెడ్స్పట్లుగా చూపడంతో పాటు తగిన చర్యలకు సంకేతాలు ఇస్తుంది. ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవే క్షిస్తూ సైబర్ దాడులు, టిటిడి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాలలో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది.
ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలను తెలుసుకుని, శ్రీవారి దర్శనాలను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితులలో భక్తులను బయటకు తీసుకువచ్చే సమీప మార్గాలను చూపుతుంది. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఎన్నారైలను అభినందించారు.
ఐసీసీసి ఏర్పాటు వెనుక…
ఇంటిగ్రేటెడ్ కామాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) సాంకేతిక పరిజ్ఞానం` సనాతన ధర్మం కలయికగా చెప్పవచ్చు. ఈ ఐసీసీసి వెనుక ఎన్నారైల దాతృత్వం, శ్రమ, ముఖ్యంగా బే ఏరియాలో ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న శ్రీ వేజెండ్ల కృషి ఎంతో ఉంది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఫాల్కన్ ఎక్స్ సెంటర్ లో ఉన్న కొన్ని స్టార్టప్ కంపెనీలను, కొంతమంది ఐటీ నిపుణులను కలిశారు. అప్పుడు ఆయన దృష్టికి వచ్చిన ఒక ఎఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఐడియాను తిరుమల తిరుపతిలో భక్తులకు అనుసంధానం చేయడం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచన చేశారు.
- ఐటీ రంగ నిపుణులు, ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న జే.పి. వేజండ్ల ఆ సూచన ప్రకారం ఈ ప్రోగ్రామ్ ను ఏ విధంగా అనుసంధానం చేయగలమా, చేస్తే ఎలా చేయాలి అని దానిమీద బాగా స్టడీ చేశారు. తరువాత దానిని కార్యరూపంలోకి తీసుకురావాల నుకున్నారు. ఫిబ్రవరి 2025లో ఇండియా వచ్చి తిరుమల చేరుకొని టీటీడి బోర్డ్ చైర్మన్ బి.ఆర్. నాయుడు గారితో చర్చలు జరిపారు. తరువాత జేఈవో శ్రీ వెంకయ్య చౌదరి నుంచి తమకు కావాల్సిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
- అమెరికాలో ఉన్న కార్య ఫౌండేషన్ (లాభాపేక్ష లేని 501(సి) సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు (దాదాపు రూ.30 కోట్లు) సమకూర్చుకుంటూ అనేక మంది ఐటీ నిపుణుల తోను ఐటీ సంస్థలతోనూ మాట్లాడి వారి సహకారం తీసుకొంటూ ఈ ఎఐ ఆధారిత ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
- హైదరాబాద్‌లో ఉన్న ఎక్విప్ సోషియల్ ఇంపాక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ పిపిపి (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్) మీద, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సంస్థల సహకారం తీసు కొని ఈ ప్రోగ్రామ్‌ను కార్యరూపంలోకి తీసుకు వచ్చారు. ఈ ప్రోగ్రామ్ కోసం వేజెళ్ళతో పాటు, కొందరు ఎన్‌ఆర్‌ఐలు, వారి ఆఫీసు సిబ్బంది దాదాపు మూడు వారాలు శ్రమించి అనేక విధాలుగా పరీక్షలు జరిపి సిస్టమ్ ను రెడీ చేశారు.
- దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక సంవత్సరం పైగా శ్రమించి నిర్మించిన ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో శ్రీ జెపి. వేజెండ్ల, శ్రీ అనురాగ్ జ్కెస్, శ్రీ శ్రీనిరాజు, శ్రీ బీ.వీ జగదీప్, శ్రీ ప్రవీన్ అక్కిరాజు, శ్రీ రాజు ఇందుకూరి, శ్రీ రవి అక్కిరెడ్డి కీలకపాత్ర పోషించారు.