శ్రీవారి దర్శనం ఇక సులభతరం చేస్తా… బీ.ఆర్. నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీ.ఆర్. నాయుడు) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహిత మిత్రుడు, టీవీ 5 ఛానల్ చైర్మన్‌గా ఉన్న బి.ఆర్ నాయుడు హిందూ సమాజం ఉన్నతికి విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను టీటీడికి చైర్మన్‌గా చంద్రబాబు ఎంపిక చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన బిఆర్ నాయుడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారునిగా ఉన్న బిఆర్ నాయుడు తన హయాంలో టీటీడిని భక్తులకు దగ్గర చేయడంతోపాటు స్వామివారి దర్శనానికి ఇబ్బందుల్లేకుండా సామాన్యులు దర్శించుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు. అలాగే తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చూడటానికి ప్రాముఖ్యత ఇస్తానని ఇందుకు అనుగుణంగా తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అనుకున్నట్లుగానే తన ఆధ్వర్యంలో జరిగిన తొలి టీటీడి బోర్డ్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీటీడి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాక తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలను పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాము.
టీటీడి చైర్మన్ పదవిని మీరు ఆశించారా?
అవును. ఈ ప్రాంతవాసిగా నేను టీటీడి చైర్మన్‌గా భక్తులకు సేవ చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచే అనుకున్నాను. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయమై ఆయనను అడిగాను. తరువాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని అడిగాను. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆలోచించి నన్ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆయనకు ధన్యవాదాలు. నా చిరకాల కోరిక ఈ పదవి రాకతో తీరింది. భగవంతుని సేవ చేసే భాగ్యం నాకు ఈపదవి ద్వారా లభించింది. చైర్మన్‌గా అందరితో కలిసి నిర్ణయాలు తీసుకుని తిరుమల ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తా.
ఐదు సంవత్సరాలుగా తీవ్ర విమర్శలు, వివాదాలను ఎదుర్కొన్న టిటిడి ఇమేజ్‌ను చైర్మన్‌గా ఎలా పునరుద్ధరించనున్నారు. మీ దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా?
గత ప్రభుత్వ హయాంలో టీటీడి పాలనను భ్రష్టుపట్టించారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసే ప్రయత్నాలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిరది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడి పవిత్రతను పునరుద్దరించడమే తన ధ్యేయమని చెప్పారు. అలాగే ఈ ప్రాంతానికి చెందిన నాకు తిరుమల మీద, పరిస్థితుల మీద మంచి అవగాహన ఉంది. ఆరునెలల ముందు నుంచే నేను ఇందుకోసం తగిన ప్రణాళికలను రూపొందిం చుకున్నాను. ప్రస్తుతం చైర్మన్‌గా ఈ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమల్లోకీ తీసుకువస్తాను. తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాను.
భక్తుల కోసం ఏ విధమైన నిర్ణయాలను మీరు తీసుకోనున్నారు?
మనం తీసుకునే ఏ నిర్ణయమైనా, అది భక్తుల శ్రేయస్సు కోసమే ఉంటుంది. తిరుమలకు వచ్చిన భక్తులు కష్టాలబారిన పడకుండా సులభంగా శ్రీవారిని దర్శించుకోవాలన్నదే నా అభిమతం. అన్ని గంటలపాటు వారిని క్యూలైన్లలో బంధించి 2 సెకన్లపాటు స్వామి దర్శనం కల్పించడం వల్ల వారు సంతృప్తిగా వెనుదిరగలేరని నేను అనుకుంటున్నాను. వారు సంతృప్తి చెందే విధంగా దర్శనం, వసతి సౌకర్యాలు మెరుగుపరుస్తాను.
తిరుపతి లడ్డు వివాదం, ఇతర ఆరోపణలను ఎలా పరిష్కరించనున్నారు?
గత సంఘటనల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. తిరుపతి లడ్డు విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణకు ఆదేశించింది కాబట్టి, కామెంట్ చేయాలనుకోవడం లేదు. అయితే ఆలయం, లడ్డు ఇతర ప్రసాదాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే లడ్డు నాణత్యను పెంచారు. లడ్డులో వాడే నెయ్యి, ఇతర పదార్ధాలను మంచి కంపెనీల నుంచే తీసుకుంటున్నాము. అలాగే ఇతర ప్రసాదాలను కూడా నాణ్యతతో ఉండేలా చూస్తాను.
బీజేపీ, ఇతర హిందూ సంస్థలు టీటీడిలో హిందువులు మాత్రమే పని చేయాలంటున్నారు? దీనిపై మీ స్పందన ఏమిటి?
టీటీడి హిందూ మతపరమైన స్వయంప్రతిపత్తి సంస్థ. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఆలయంలో హిందువులు కానివారు పని చేయకూడదు. ఇది హిందూ ఆలయం. ఇప్పటికే టీటీడిలో అన్యమత ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు బోర్డ్ తొలి సమావేశంలోనే చర్చించాము. దీనిపై ఓ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడిలో పనిచేస్తున్న హిందువులు కాని ఉద్యోగులు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమో లేక రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ అయినా కావాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ బోర్డ్‌లో ఒక తీర్మానాన్ని ఆమోదించాము. టీటీడీలో ఏడు వేల మంది ప్రత్యక్షంగా మరో పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు. బోర్డ్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హిందూయేతర ఉద్యోగులుగా ఉన్న 300 మందికిపైగా ఉన్న ఉద్యోగులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నాము. అయితే హిందూయేతర సిబ్బందిని బదిలీ చేయవచ్చా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలా అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము.
తెలుగుటైమ్స్ ద్వారా మీరు చెప్పే సందేశమేమిటి?
అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ఎల్లవేళలా టీటీడి సిద్ధంగా ఉంది. ఎన్నారైలు తిరుమ లకు వచ్చినా వారికి అవసరమైన దర్శనం ఇతర వసతి సౌకర్యాలను ప్రత్యేకంగా కల్పించడం జరుగుతుంది. ఎన్నారై కోటా అవకాశాన్ని ఎన్నారైలు సద్వినియోగం చేసు కోవాలని కోరుతున్నాను. ఎన్నారై సంఘాలు స్వామివారి కళ్యాణోత్సవాలు చేయాలనుకుం టే తగిన ప్రపోజల్స్‌తో ముందుకు వస్తే పరిశీలిస్తాము. గతంలో అమెరికాలోనూ, యుకె ఇతర దేశాల్లోనూ టీటీడి కళ్యాణత్సో వాలు జరిగాయి. ఇక ముందు కూడా నిర్వహించేందుకు టీటిడి సిద్ధంగాఉంది.
తొలి బోర్డ్ సమావేశంలోనే బిఆర్ నాయుడు సంచలన నిర్ణయాలు
టిటిడి బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన తొలి బోర్డ్ సమావేశంలోనే బిఆర్ నాయుడు తన విశ్వరూపం చూపించారు. టీటీడిలో హిందువులు కాని వారు పని చేయడానికి వీలు లేదని నొక్కి చెప్పడంతో పాటు వారిని పంపించేందుకు తీర్మానం కూడా చేశారు. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే కావాలని అయితే హిందూయేతర సిబ్బందిని బదిలీ చేయవచ్చా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలా అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాలకు కేంద్రమైన శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చేలా తీర్మానం చేయించారు. గత ప్రభుత్వం తిరుపతిలో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేయడాన్ని తప్పుబడుతూ ఆ లీజు రద్దుకు సిఫార్సు చేశారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టే అవకాశాలపై అన్వేషించంతోపాటు ఇందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహకారం తీసుకోవాలని టీటీడి అధికారులకు సూచించారు.
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం ఇస్తూ వారి కోరికను నెరవేర్చారు. గత ప్రభుత్వంలో టూరిజంలో ఉన్న కొందరుదళారులు శ్రీవారి దర్శన టిక్కెట్లను అమ్ముకున్నారని, టీటీడి పేరు ప్రతిష్టలను మంటగలిపారన్న ఆరోపణలు వాస్తవం అని తేలడంతో ఆ టిక్కెట్ల కోటాను రద్దు చేయించారు. తిరుమలలో ఇకపై రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు చేపడటంతోపాటు ఎవరైనా మాట్లాడితే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతోపాటు అవసరమైతే నిబంధనలకు విరుద్దంగా ఉంటే కూల్చివేస్తామని కూడా స్పష్టం చేయడం ఆయనకు తిరుమల పవిత్రతపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా కనిపిస్తోంది.