TTD: టీటీడీలో అన్యమతస్థుల వివాదం..! రాజశేఖర్ బాబు సస్పెన్షన్‌తో మరోసారి తెరపైకి..!!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), హిందూ ధార్మిక సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించే ఈ సంస్థలో అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (AEO) రాజశేఖర్ బాబును (Rajasekhar Babu) సస్పెండ్ చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అన్యమతస్థులను టీటీడీ నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది.
తిరుపతి జిల్లాలోని పుత్తూరుకు చెందిన రాజశేఖర్ బాబు, టీటీడీలో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రతి ఆదివారం స్థానిక చర్చిలో ప్రార్థనలకు హాజరవుతున్నారని, ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని ఒక భక్తుడు ఫొటోలు, వీడియోలతో సహా విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. విచారణలో రాజశేఖర్ బాబు అన్యమత ప్రార్థనల్లో పాల్గొంటున్నట్టు నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధారంగా, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) శ్యామల రావు ఆయనను జులై 8న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టీటీడీ ఉద్యోగులు హిందూ ధార్మిక సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తారని, వారి ప్రవర్తన సంస్థ పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రాజశేఖర్ బాబు విషయంలో ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. ఇలాంటి ఉద్యోగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది.
టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేస్తున్నారనే వివాదం కొత్తది కాదు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీలో 200 నుంచి 300 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. 2024 నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో, అన్యమత ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) లేదా ఇతర సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నాటికి, 18 మంది అన్యమత ఉద్యోగులను బదిలీ చేసినట్టు అధికారులు తెలిపారు. వీరిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయు ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్యాసంస్థల లెక్చరర్లు ఉన్నారు.
తిరుమల ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడమే కాక, హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. టీటీడీ ఉద్యోగులు ఈ సంప్రదాయాలను పాటించడం ద్వారా భక్తుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కలిగి ఉంటారని అధికారులు పేర్కొన్నారు. అన్యమత కార్యకలాపాల్లో పాల్గొనడం సంస్థ నియమావళికి విరుద్ధమే కాక, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. రాజశేఖర్ బాబు సస్పెన్షన్ ఘటన టీటీడీలో అన్యమత ఉద్యోగుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించేందుకు టీటీడీ స్పష్టమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.