Tandanana: తాళ్లపాక అన్నమాచార్య సంగీత మహోత్సవం
– ‘తందనాన – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీ 2025’
– దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 12 దేశాల నుంచి 600 పైగా ఎంట్రీలు
– డిసెంబర్ 20న అన్నమయ్యపురంలో గ్రాండ్ ఫినాలే
తాళ్లపాక అన్నమాచార్య సంగీత వైభవాన్ని గుర్తు చేసే లక్ష్యంతో ‘తందనాన – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీ 2025’ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ దగ్గర ఎన్ఏసీ రోడ్డులో ఉన్న అన్నమయ్యపురం (Annamayyapuram)లో నిర్వహించనున్నట్లు అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మశ్రీ డాక్టర్ శోభా రాజు తెలిపారు. ఈ వివరాలు తెలిపేందుకు హైటెక్ సిటీలో ఉన్న సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించే ప్రసిద్ధ ‘తందనాన’ (పద విరామ గానం) సార్వత్రిక సమానత్వం, భక్తి భావం, సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పోటీ ద్వారా అన్నమయ్య కీర్తనల సంగీత వైభవం, ఆయన సార్వజనీన సందేశం జాతి, మతం, భాష, భూభాగం అనే అన్ని హద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా వినిపించబడుతుందని చెప్పారు.
అన్నమయ్య రచించిన ఈ సంగీత సంపదను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత, కళాభిమానులు, సంగీత విద్వాంసులు పాడడం ఈ పోటీ ప్రత్యేకత అన్నారు. ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి పాల్గొనడం ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ పోటీలో యువ అభిరుచి గల కళాకారులు నుంచి అనుభవజ్ఞులైన సీనియర్ గాయకుల వరకు మూడు వయసు విభాగాలలో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. ఈ పోటీ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు దుబాయ్, సింగపూర్, అమెరికా సహా 12 దేశాల నుంచి 600 పైగా ఎంట్రీలు వచ్చాయన్నారు. వీటిని అనుభవజ్ఞులైన సంగీత నిపుణుల ప్రత్యేక జ్యూరీ బృందం అత్యంత జాగ్రత్తగా పరిశీలించిందన్నారు. ఈ ప్రక్రియ అనంతరం గ్రాండ్ ఫినాలే కోసం తొమ్మిది మంది గాయకులను ఎంపిక చేయనున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లోని అన్నమయ్యపురం వేదికగా జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్లు కార్యక్రమాన్ని నడిపిస్తారన్నారు. అదే రోజు విజేతలను ప్రకటించడానికి ప్రత్యేక వేడుక నిర్వహించనున్నామని చెప్పారు. గ్రాండ్ ఫినాలేలో విజేతలుగా నిలిచే ముగ్గురు గాయకులకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, శైలజ కిరణ్ సహకారంతో గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నామన్నారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడలో జరిగే ప్రత్యేక వేడుకలో బంగారు పతకాలను అందజేయనున్నారని తెలిపారు. ఈ గ్రాండ్ ఫినాలేకు పరమపూజ్య చినజీయర్ స్వామి ప్రధాన అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. సంగీతం, ఆధ్యాత్మికత, కళలను ఆదరించే పలువురు విశిష్ట అతిథులుగా ఈ వేదికను అలంకరించనున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమం భక్తి, సంగీతం, సాంస్కృతిక ఏకత్వానికి ఒక మహోన్నత సమాగమంగా నిలవనుందన్నారు. ఈ మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నమయ్య భక్తులు, సంగీతాభిమానులు, కళా సేవకులను ఒక వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడిందన్నారు. ఈ చారిత్రాత్మక సాంస్కృతిక మహోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో అన్నమాచార్య భావన వాహిని తరఫున దాతలు, కళాభిమానులు, ఆధ్యాత్మిక సేవకులు, శ్రేయోభిలాషులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. మీ అమూల్యమైన సహకారం, ప్రోత్సాహం, శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత, భక్తి వారసత్వాన్ని కొనసాగించడంలోనూ భవిష్యత్తు తరాలకు భక్తి విలువలతో కూడిన సంగీత పంథాను అందించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.
స్పాన్సర్‌షిప్‌లు, దాతృత్వ సహకారం కోసం సంప్రదించండి. అన్నమాచార్య భావన వాహిని (ఏబీవీ), అన్నమయ్యపురం, ఎన్ఏసీ రోడ్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
📞 +91-98480 24042 ✉️ info@annamacharyabhavanavahini.org







