TTD: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టుల పర్వం..! సిట్ దూకుడు పెంచిందా..?

తిరుమల (Tirumala) శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి (adulterated ghee) వినియోగించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు (Supreme Court) ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ (SIT) ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సిట్ విచారణ జరుపుతోంది. అయితే తొలిసారి ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను సిట్ అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పరిచింది. వాళ్లకు ఈ నెలాఖరు వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకోసం నెయ్యి సరఫరా చేసేందుకు తమిళనాడులోని AR డెయిరీతో (A R Dairy) టీటీడీ ఒప్పందం చేసుకుంది. కిలో రూ.319 చొప్పున టీటీడీకి (TTD) నెయ్యి సరఫరా చేసేందుకు AR డెయిరీ అంగీకరించింది. దేశంలో ఎక్కడా ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసే కంపెనీ మరొకటి లేదు. అయినా అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) AR డెయిరీతో ఒప్పందం ఖరారు చేసుకున్నారు. ఒప్పందం మేరకు AR డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ నెయ్యి ట్యాంకర్లలో కొన్నింటిని ప్రసాదాల తయారీకి కూడా వినియోగించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో నెయ్యి నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. దీనిపై ఆరా తీయాలని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
టీటీడీ అంతర్గత విచారణలో నెయ్యిలో నాణ్యత లోపించిందని నిరూపణ అయింది. దీంతో ఆ నెయ్యిని పక్కన పెట్టేసి కల్తీ నెయ్యిపై విచారణ జరపాలని ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సిట్ పై అనుమానాలు లేవనెత్తుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులు, మరొకరు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండేలా ఆదేశాలిచ్చింది. ఇప్పడీ బృందం తిరుపతి కేంద్రంగా విచారణ జరుపుతోంది.
నెయ్యి సరఫరా మొదలు సప్లై వరకు అనేక అంశాలపై సిట్ విచారణ మొదలు పెట్టింది. ఇందులో అసలు AR డెయిరీకి ఏడాదికి 10 లక్షల టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని నిర్ధారణ అయింది. దీంతో శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డెయిరీతో AR డెయిరీ ఒప్పందం చేసుకుంది. వైష్ణవి డెయిరీకి (Vaishnavi Dairy) కూడా అంత కెపాసిటీ లేకపోవడంతో ఉత్తరాఖండ్ లోని భోలేబాబా డెయిరీతో (Bhole Baba Dairy) ఆ సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భోలేబాబా డెయిరీ నుంచి కిలో రూ.355 చొప్పున నెయి కొనుగోలు చేసేందుకు వైష్ణవి డెయిరీ ఒప్పందం చేసుకుంది. దీన్ని AR డెయిరీకి అమ్మింది. AR డెయిరీ టీటీడీకి సప్లై చేసింది.
అయితే భోలేబాబా డెయిరీ నుంచి కొనుగోలు చేసిన మొత్తం కంటే టీటీడీకి సప్లై చేసిన నెయ్యి ధర తక్కువగా ఉండడం అనుమానాలు రేకెత్తించింది. ఇక్కడే నెయ్యి కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీటీడీతో ఒప్పందం చేసుకున్న AR డెయిరీ.. వైష్ణవి, భోలేబాబా డెయిరీలతో కలిసి కల్తీ నెయ్యిని సప్లై చేసినట్లు తేలింది. ఇదే విషయాన్ని సిట్ ఈ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. వాళ్లు నీళ్లు నమలడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ అయిన వారిలో భోలేబాబా డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎంపీ డాక్టర్ రాజు రాజశేఖర్ ఉన్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం మేరకు త్వరలో నాటి టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది.