TTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…

ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు తితిదే ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఈ బదిలీతో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal) మరోసారి టీటీడీ (TTD) ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2014లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. ఆ సమయంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా బదిలీ చేసింది. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు అనిల్ కుమార్ సింఘాల్ అదే పదవిలో కొనసాగిన సంగతి తెలిసిందే. రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్ మీనా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మికశాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్ నియమితులయ్యారు.