Ayodhya: వైభవంగా అయోధ్య ధ్వజారోహణం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య (Ayodhya) లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలోఅంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ సంయుక్తంగా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం వేద మంత్రాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగింది. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. తరువాత ఆయన నగరంలో రోడ్‌షో నిర్వహిస్తూ, రామమందిరం వైపు తరలి వెళ్లారు. దారిలో ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. మార్గంమధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక అయోధ్య – మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బాలరాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. జైశ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రామభక్తుల సంకల్పం సిద్ధించింది. కోట్లాది మంది కల సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగింది.
ధర్మ ధ్వజం కేవలం జెండా కాదని..భారత సంస్కృతి పునర్వికాశానికి చిహ్నమని ప్రధాని మోదీ అభివర్ణించారు. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నమని పేర్కొన్నారు. ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. ధర్మ ధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుందని స్పష్టం చేశారు. కర్మ,కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం వివరిస్తుందన్నారు. పేదలు,దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ధ్వజారోహణ కార్యకమ్రంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయన్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెబుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నందున ప్రతి రామభక్తుడి హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని అన్నారు. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెబుతుంది. రాముడు కులం చూడడు.. కేవలం భక్తి మాత్రమే చూస్తాడు. ధర్మధ్వజంపై కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది’’ అని ప్రధాని తెలిపారు.
‘‘మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వారు అంటున్నారు. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు. భారత్‌లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు. ఇది మన డీఎన్ఏలోనే ఉంది. శతాబ్దాల క్రితమే భారత్‌లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోంది. వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘ఈ రోజు అందరి ఆశలు నెరవేరిన దినం. రామజన్మభూమి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆత్మలు ఈ రోజు సంతృప్తి చెందుతాయి’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ఈ పవిత్ర దినం.. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులకు అంకితం అని అన్నారు.
ధ్వజారోహణం.. ప్రత్యేకతలివే..
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు. గతేడాది జనవరి 22న ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయవర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది. వాల్మీకి రామాయణం ప్రకారం.. కశ్యప మహాముని మందార, పారిజాత మొక్కలను కలపడంతో ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెబుతారు. ప్రాచీన కాలం నుంచే మొక్కలు అంటుకట్టే విధానం ఉందనే దాన్ని ఇది సూచిస్తుంది. ధ్వజారోహణ జరిగిన నేటి తేదీకి (నవంబర్ 25) ప్రత్యేకత ఉంది. నేడు వివాహ పంచమి. ఇదేరోజున సీతారాముల కల్యాణం జరిగింది. ఇక, అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారుచేసింది. సుదీర్ఘకాలం మన్నేలా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి దీన్ని తీర్చిదిద్దారు.






