Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణకు సౌత్ ఇండియా దేవాలయాలు సందర్శించనున్న పవన్..

ఏపీ ఉప ముఖ్యమంత్రి (AP Deputy cm) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్య సమస్యల నుంచి కోలుకొని మళ్లీ తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ సమస్యలతో బాధపడారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో విశ్రాంతి తర్వాత తన పర్యటనలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 12 నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు (Pawan South Indian tour) రెడీ అవుతున్నారు.
సనాతన ధర్మ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం లో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హిందూ ధర్మ పరిరక్షణ గురించి పలు సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. ముందుగా ఈ పర్యటన ఈ నెల 5 నుంచి జరగాల్సి ఉండగా, ఆరోగ్య సమస్యల కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం జ్వరం పూర్తిగా తగ్గడంతో పార్టీ వర్గాలకు పవన్ తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జనసేన వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ పర్యటన మూడు రోజులకు పరిమితం కానుంది. 12, 13, 14వ తేదీల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. కేరళలో అనంతపద్మనాభ స్వామి ఆలయం, తమిళనాడులో మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరుశ రామస్వామి ఆలయం, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ సందర్శించనున్నట్లు సమాచారం.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై దృష్టి సారించారు. అప్పట్లో ఆయన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇప్పుడు దక్షిణాదిలోని ప్రధాన ఆలయాలను సందర్శించి ధర్మ పరిరక్షణపై మరోసారి ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనకు హిందూ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని తీవ్రంగా అమలు చేయడం తెలిసిందే. సనాతన ధర్మంపై తన నమ్మకాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆలయాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. ప్రజల సమస్యలపై స్పందించడమే కాకుండా, హిందూ ధర్మ పరిరక్షణకు కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు.
ఈ పర్యటనను మొదట ఐదు రోజులకు ప్లాన్ చేసినా, బిజీ షెడ్యూల్ కారణంగా మూడు రోజులకు కుదించారు. పవన్ రాజకీయ ప్రస్థానం ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియదుకానీ, ధర్మ పరిరక్షణపై ఆయన చూపించే ఆసక్తి చాలా మందికి ప్రేరణనిచ్చేలా ఉంటుంది. ఆయన ఆలయ సందర్శనతో హిందూ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.