Mumtaj Hotel: తిరుమలలో ముంతాజ్ హోటల్ వివాదం..హిందూ సంఘాల ఆందోళన ఉధృతం

తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) సంబంధించిన వివాదాలు తాజాగా మరింత చర్చనీయాంశంగా మారాయి. ఆలయానికి సమీపంలో ముంతాజ్ హోటల్‌కు (Mumtaj hotel) స్థలం కేటాయించిన అంశంపై హిందూ సంఘాలు, స్వామీజీలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తిరుమల (Tirumala) ఏడు కొండల పవిత్రత దెబ్బతింటుందని, సనాతన ధర్మానికి ఇది ముప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీనివాసానంద సరస్వతి స్వామి (Srinivasananda Saraswathi Swamy) నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
దేవస్థానం పాలక మండలి ఈ స్థల కేటాయింపును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ముందుకు సాగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ముంతాజ్ హోటల్ నిర్మాణంపై తిరుమల భక్తులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, దీక్షా శిబిరంలో “తిరుమల ప్రక్షాళన అంటే ముంతాజ్ హోటల్ కట్టడమా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆందోళనకారులు తిరుమల పవిత్రతను కాపాడాలని, హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో స్వామీజీలు దీక్షను కొనసాగిస్తుండగా, హిందూ సంఘాలు కూడా నిరసనకు మద్దతు తెలుపుతున్నాయి. ఇది కేవలం భక్తుల ఆందోళన మాత్రమే కాకుండా, సమాజంలో వివిధ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఈ వివాదంపై రాజకీయ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు గతంలో తిరుమలను ప్రక్షాళన చేస్తానని ప్రకటించగా, పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మంపై తనకున్న భక్తిని పలుమార్లు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారిద్దరూ ఈ అంశంపై ఏవిధంగా స్పందిస్తారన్నది ప్రశ్నగా మారింది. దీక్షా శిబిరాల్లో “సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్?” అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో, ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది.
తిరుమల దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నారా? అని స్వామీజీలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు ఇది ముప్పుగా మారుతుందా? దేవస్థానం పాలక మండలి తీర్మానం చేసినా, ప్రభుత్వం ఎందుకు స్థలం కేటాయించిందన్న దానిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చర్య ఉందని, దీని వెనుక మరేదైనా ఆంతర్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో, భక్తులు, హిందూ సంఘాలు ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. తిరుమల ఏడుకొండలను రక్షించుకోవాలన్న సంకల్పంతో దీక్షలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.