TTD: ఎమ్మెల్యే లెటర్ల బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పటి వరకు అంటే…!

మార్చి 24 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో (Tirumala)శ్రీవారి దర్శనం అమలులోకి రానున్న నేపధ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మార్చి 25 మరియు మార్చి 30వ తారీఖుల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు.. శ్రీవారి దర్శనం మార్చి 24వ తారీఖు నుండి అమలులోకి రానుంది. ఇందులో భాగంగా ఆదివారం సిఫార్సు లేఖలను అధికారులు స్వీకరించనున్నారు.
అయితే ఇదివరకే టీటీడీ(TTD) తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈనెల 30వ తారీఖున శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని.. మార్చి 25వ తారీఖున మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ కారణంగా మార్చి 25వ తేదిన వీఐపీ బ్రేక్ దర్శనం కొరకు మార్చి 24వ తారీఖున ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ప్రకటించింది.
అదేవిధంగా ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు.. ఆదివారం దర్శనం కొరకు.. స్వీకరిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. అయితే మార్చి 30వ తారీఖున ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. ఈ మేరకు టీటీడీ అధికారులు మీడియాకు ప్రకటన విడుదల చేసారు.