డా. రమణ వి. వాసిలి: గీతాసాహిత్యంలో మణిమకుట కలికితురాయి వాసిలి “జీవనగీత”

భగవద్గీత (Bhagavad Gita) భగవద్గీతే! ఆ గీత అసమానమైన, అనుపమానమైన, మహోత్కృష్టమైన గ్రంథం. చక్కెర తీపిదనం వేరు, బెల్లం తీయదనం వేరు. మధురమైన తేనె తీయందనాన్ని స్ఫురణకు తెస్తుంది కాబట్టి ‘గీతామకరందం’గాను; పరతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ‘గీతామృతం’గాను ప్రసిద్ధమైంది.
“మానవ పుట్టుకకి, మానవ జీవనానికి ప్రయోజనం, పరమార్థం ఉందని విశ్వసిస్తే, ఆ ప్రయోజనానికి మార్గాన్ని చూపి, సాఫల్యం సహకారం చేయగలిగేది శ్రీకృష్ణగీత” అంటూ ఎంతో సరళంగాను, స్పష్టంగాను చెప్పారు డాక్టర్ వాసిలి వసంతకుమార్ తమ గ్రంథం “కొత్తకోణంలో గీతారహస్యాలు” మొదటి భాగం “జీవనగీత”లో.
వ్యక్తి వికాసానికి, వ్యక్తిత్వ చైతన్యానికి, ఆత్మ శోధనకి, ఆత్మ జ్ఞానానికి, పర తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, విశ్వాత్మ తత్వాన్ని అర్థం చేసుకోడానికి గీత మార్గదర్శి. గీతా పఠనంతో, గీతా శ్రవణంతో అందరూ అంతో ఇంతో జ్ఞానులవుతారు. కానీ అర్థమైనదాన్ని స్థితప్రజ్ఞతో ఆచరించడానికి ఆత్మసంస్కారం కావాలి. స్వ పర భేదం లేకుండా, ధర్మాధర్మ ప్రాతిపదికన బాంధవ్యాల కతీతంగా కేవలం ‘ధర్మ ప్రతిష్ఠాపన’ కోసం ధర్మబద్ధులై జీవించాలి, వర్తించాలి. అందుకు మార్గం చూపేది గీత.
‘భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువవో మనసా!’
‘హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవో మనసా!’
‘విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా!’
‘అచ్యుతు డితడె ఆదియు నంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీద నిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా!’
భగవద్గీత హిందువుల ‘హ్యాండ్ బుక్’ అన్నది సాధారణ అభిప్రాయం. అయినా ఆ అభిప్రాయం అసత్యం కూడా. గీతని చదవనివారు, గీతని విననివారు, గీత తెలియనివారు, గీత తెలుసుకోవలసిన అవసరం లేనివారు గీతని హిందూ మతగ్రంథంగానో, భారతీయతని భారతీయ జనజీవనాన్ని ప్రతిబింబించే ప్రవచనంగానో భావించవచ్చు. మహాభారతం ఒక మహోన్నత చారిత్రకం. కురుక్షేత్రం మానవ చరిత్రలో ఒక మహోత్కృష్ట ఘటన. ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా పరాత్పరుడు, జగన్నాటక సూత్రధారి, పరమాత్మ ‘ధర్మ ప్రతిష్ఠాపన’ కోసం బ్రహ్మముహూర్తాన తనను తాను ఆవిష్కరించుకున్న విశ్వరూప సందర్శనం.
గీతలోని పాత్రలు, పాత్రధారులు, కాలం, సంఘటనలు భారతావనితో ముడిపడి ఉండవచ్చు. కానీ ఆవిష్కరింపబడిన ‘సత్యాలు’ విశ్వజనీనం. కుల, మత, ప్రాంత, దేశ, భాషల కతీతంగా సర్వులకు, సర్వత్రా మార్గదర్శి గీత. ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం. ఆనాటి ఆ కథ, కథనం, నాయికా నాయకులు, వివిధ పాత్రలు – కలియుగంలో నేటికీ మన జీవితాలతో అన్వయించుకోవచ్చు. నాడు దాయాదుల (కౌరవ పాండవులు) మధ్య జరిగిన ఆధిపత్యపోరు నేటికీ మన జీవితాలలో చూస్తుంటాం. దుర్యోధన సార్వభౌముడిలోని అధికార దాహం, అర్జునుడిలోని చంచలత్వం, చపలత్వం, బేలతనం; ధర్మరాజులోని ధర్మవర్తనం; ద్రౌపదిలోని న్యూనతాభావం, ప్రతీకారేచ్ఛ … ఈ రకంగా అరిషడ్వర్గాలు నాటికీ నేటికీ సహజమే! అందుకే డాక్టర్ వాసిలి “గీత అన్ని కాలాలకు నిలచిన ప్రామాణిక గ్రంథం” అంటారు. గీతలో సమకాలీన ఉపయుక్త ధర్మాలు కోకొల్లలు.
‘తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి’ అన్నది నానుడి. శ్రీకృష్ణ పరమాత్మునిది ముగ్ధమనోహర దివ్యమంగళ మూర్తిత్వం. అందుకే మహాభారతంలోని అంతర్భాగమైన కృష్ణోపదేశం సమ్మోహనం, పరమామృతం. అనిర్వచనీయమైన అలౌకికానందానికి సోపానాలు పరుస్తుంది గీత. నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కృతికి ఆయువుపట్టు గీత. జీవన సుడిగుండంలో ఆశాకిరణమే కాదు ఆటుపోట్లని తట్టుకొని ఒడ్డుకు చేర్చగల ఏకైక ఆదరువు గీత. అసంభవాన్ని, అసాధ్యాన్ని ధర్మాధర్మ ప్రాతిపదికన అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కృతం చేయగలిగేది; సాధ్యం, సంభవం, సఫలం చేయగల బ్రహ్మాస్త్రం కృష్ణగీత.
డాక్టర్ వాసిలి వసంతకుమార్ “కొత్తకోణంలో గీతారహస్యాలు” గీతని విశ్లేషించి, ఆకళింఫు చేసుకొని, కేవలం కొత్తకోణంలో చెప్పిన రహస్యాలుగా కాక స్వీయ అనుభవంతో, ప్రజ్ఞతో, ఆత్మజ్ఞానంతో తెలుసుకున్న అలౌకిక, అధిభౌతిక విషయాలను పంచుతున్నట్లు తోస్తుంది. ఉదాహరణకు –
“మనది దేహపరంగా లౌకిక అన్వేషణ, ఆత్మపరంగా పారలౌకిక అన్వేషణ. పర అన్వేషణకు కావలసిన జ్ఞానసంపద మన వాకిళ్లలోనే ఉంది. విచక్షణతో కూడిన జ్ఞానం, జ్ఞానవిచక్షణతో కూడిన జీవనం – జ్ఞానయోగం. భౌతిక జీవితాన్ని అధిభౌతికంతో ముడిపెడుతుండటం వల్ల కర్మయోగం. ఆత్మజ్ఞానంతో ఆత్మ పాత్రను దేహం నుండి, మనసు నుండి, కాలం నుండి తప్పించడమే అసలైన మానవ పరిణామానికి సూచిక. అంటే ఆత్మ ఈ మూడు స్థితులను దాటుకుంటూ వర్తించగలగటమే ఆధ్యాత్మిక ప్రయాణం.”
ఈవిధంగా డాక్టర్ వాసిలి చర్చించిన విషయాలు, చేసిన పరిశీలనలు, పంచిన విశ్లేషణలు ఎంతైనా శ్లాఘనీయం. గతంలో ఎందరో పండితులు చెప్పినట్లుగా కేవలం భగవద్గీతకు, గీతా శ్లోకాలకు అర్ధాలు, అంతరార్ధాలు మాత్రమే చెప్పిన మరో గ్రంథం కాదిది.
నేను అనుశీలించిన మొదటి భాగం “జీవన గీత” 44 అధ్యాయాలుగా రూపుదిద్దుకున్న 240 పుటలున్న మహోత్కృష్ట రచన. ప్రతి అధ్యాయమే కాదు ప్రతి పుటా రచయిత మేథకీ, విజ్ఞతకీ, విచక్షణకూ సాక్షిభూతంగా నిలుస్తాయి.
భౌతిక మానవ తత్వాన్ని వశీకరించుకునే సాత్విక, తామసిక, రాజస గుణాలకు అతీతం కావటమే అసలైన భక్తియోగం. భక్తిమార్గాన్ని అనుసరిస్తూ స్వర్గంలో పొందగలిగే ఇంద్రియ సుఖాల్ని ఆలోచించడం, అపేక్షించడం ఫలతృష్ణే అంటారు డాక్టర్ వాసిలి. పండితుల్ని, పామరుల్ని వాసిలి గీతా గ్రంథాలు సమంగా అలరిస్తాయనడంలో సందేహం లేదు.
ఆధ్యాత్మిక జీవనంపట్ల కొత్తగా అభిరుచి కలుగుతున్న జిజ్ఞాసువులకు ఈ పుస్తకం వారి ఆధ్యాత్మిక జీవనానికి తొలి గ్రంథంగాను, ఆది గ్రంథంగాను; అనుభవజ్ఞులకు, జ్ఞానులకు, ఆత్మ విచక్షణ కలవారికి ఈ గీతా రహస్యాలు విందుభోజనంగాను, మహోత్కృష్టమైన ఒక మహాగ్రంథంగాను గోచరిస్తుంది.
“భౌతిక జీవనాన్ని అపేక్షిస్తున్న తరుణంలో అధిభౌతిక చింతనాపరులకి నిగ్రహం అవసరం” అంటారు డాక్టర్ వాసిలి. భౌతిక జీవనాన్ని కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు నన్నది అర్థం. కానీ, కొంత సంయమనం కావాలన్నది సూచన. “భౌతిక జీవనం విశ్రమిస్తున్న సమయంలో అధిభౌతిక జీవనం జాగృతం అవుతుంది”. అంటే, గృహస్థాశ్రమం నుండి వానప్రస్థంలోకి అడుగు పెట్టడమే కావచ్చు.
దైహికమైన ఆత్మ భౌతిక ప్రజ్ఞానానికే పరిమితం కాక అధిభౌతిక ప్రజ్ఞతో పరిణమిస్తూ చరించడమే యోగజీవనం. ఇలా “మానవ జీవితం భక్తి, జ్ఞాన, కర్మల సంయోగం – అదే జీవన యోగం” అంటారు వాసిలి వసంతకుమార్. ఈ రచన ఒక నవల లాగానో, ఒక కథాసంపుటి లాగానో రెండు మూడు రోజుల్లో చదివి పూర్తి చేయగలిగేది కాదు. ప్రతి పదం, ప్రతి వాక్యం ఆలోచింపచేస్తాయి.
పఠనం సాగే కొద్దీ … వెనుక పుటల్లో చదివిన అంశాలు పునః పరిశీలించవలసి ఉంటుంది. మరల మరల ఎవరికి వారు తర్కించుకోవటం, ఆలోచించుకోవటం జరుగుతుంది. మనిషి మనీషిగా, మహిమాన్వితుడిగా, మహోన్నతుడిగా ఎదగడానికి, రూపాంతరం చెందడానికి డాక్టర్ వాసిలి ఈ పుస్తకంలో అనేక సూచనలు చేసారు. ఉదాహరణకు –
“వదిలించుకోవలసిన వాటిని నిష్కర్షగా త్యజించటం, అనవసరాలను అంటే అవసరం లేనివాటిని మొహమాటానికి కూడా దగ్గరకు చేర్చకుండటం జ్ఞాననిష్ఠ” అంటారు.
“ఏదీ మనల్ని తాకకుండా, దేనికీ ప్రలోభపడకుండా ఉండటమే కర్మనిష్ఠ. మనది కర్మభూమి కాబట్టి అనుచితంగానైనా మనం వర్తించవచ్చని కాదు. మనది జ్ఞానభూమి కాబట్టి మనం జన్మతః జ్ఞానమూర్తులని కాదు.” ఇలా డాక్టర్ వాసిలి రచన ఆద్యంతం మహాయజ్ఞంగా సాగింది. మానవ తత్వం నుండి పరతత్వం వరకు, లౌకికం నుండి పారలౌకికం వరకు, జీవాత్మ నుండి పరమాత్మ వరకు, భౌతిక నుండి అధిభౌతికం వరకు చేసిన విపులీకరణలు; జ్ఞానం, ఆత్మజ్ఞానం, దివ్యజ్ఞానం అంటూ చేసిన విశ్లేషణలు ఎంతో అనుభవంతోను, రాసిన విషయాల మీద సంపూర్ణ సాధికారత ఉన్నట్లు తోస్తుంది.
“భౌతిక జీవనం సాగిస్తూ అధిభౌతిక యానం సాగించటం సంసార యోగం. దేనికీ కర్తృత్వం వహించకుండా, నిమిత్తమాత్రంగా మానవజన్మ బాధ్యతను వహించటం సంసారయోగం”. అంటే పరతత్వ అన్వేషణలో, పరమాత్మ సాన్నిధ్యం కోసం సన్యసించడమో, పలాయనం చిత్తగించడమో ధర్మం కాదు – అన్న హెచ్చరిక పరోక్షంగా కనిపిస్తుంది.
డాక్టర్ వాసిలి వసంతకుమార్ “కొత్తకోణంలో గీతారహస్యాలు” మార్చ్ 2014 నుండి సెప్టెంబర్ 2015 వరకు దాదాపు 70 వారాలు ఆంధ్రభూమి దినపత్రికలో ‘వినదగు’ శీర్షికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకుల విశేష ఆధారాభిమానాలు చూరగొంది. ఈ “జీవన గీత” పామరుల్నే కాదు పండితుల్ని కూడా ‘ఔరా!’ అని మెప్పించగలదు.
‘భగవద్గీత మానవాళికి, యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక నిఘంటువు’. ఆ గీతా ప్రపంచంలో విశ్లేషణలు కోకొల్లలు. కానీ, డాక్టర్ వాసిలి వసంతకుమార్ రచన “కొత్తకోణంలో గీతారహస్యాలు” – “జీవన గీత” మణిమకుటంలో కలికితురాయిగా నిలిచిపోతుంది.
-డా. రమణ వి. వాసిలి
శాస్త్రవేత్త – కూచిపూడినృత్య గురువు,
Indian Ballet Theater
7062 Beringer Drive South
Cordova, Tennessee 38018 (USA)
Cell: 901 387 9646
For copies and more information
Dr. VAASILI VASANTA KUMAR
President : Yogaalaya ; Director : Master Yogaashram
Plot 90, Krishna Enclave, M.D. Farm Road, Trimulgherry, Secunderabad – 500 015
Cell : 93 93 93 39 46 , 988 988 5354 : www.yogaalaya.org / www.yogalaya.in