Koneru Hampi: కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా “ధైర్య” పురస్కారం

అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న “నాద బ్రహ్మోత్సవ్- 2025” భాగంగా దశమి రోజున సాయంత్రం శోభారాజు గారిచే శిక్షణ పొందిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ విద్యార్థులు “అర్జున్, కృతిక, హరిని, అభినవ్, అభిరామ్, అక్షయ్, మానస పటేల్, తన్వి, హితస్వి, మోక్ష, కర్ణిక, సువర్ణ, పద్మశ్రీ, జనని భవిష్య, చైత్ర, రన్విత, ఆశ్రిత, అక్షయ, దుర్గాభవాని, వాసంతి, జానకి, డా. శశికళ, మారుతి విజయలక్ష్మి, పార్వతి, బి. వి. శర్మ, ఆహన” సంయుక్తంగా “మాతృదేవోభవ, అంబికే జగదంబికే, చిత్తము కొలది, కొండలలో నెలకొన్న కోనేటి రాయుటివాడు, నానాటి బతుకు నాటకము” అనే సుప్రసిద్ధ అన్నమయ్య సంకీర్తనలను శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి సభక్తి పూర్వకంగా సమర్పించారు. కాగా, శ్రీ యుక్తా రెడ్డి గారు “హిమగరి తనయే హేమలతే” అనే సంకీర్తనకు నృత్య కైంకర్యం చేశారు.
కాగా ఈ కార్యక్రమానికి భారత్ మాజీ ఉపరాష్ట్రపతి, మంత్రివర్యులు, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) గారు, రిటైర్డ్ ఐపీఎస్ శ్రీ జె. డి. లక్ష్మినారాయణ (JD Lakshminarayana) గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రఖ్యాత చెస్ (చదరంగం) గ్రాండ్మాస్టర్, అర్జున మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి కోనేరు హంపి (Koneru Hampi) గారికి “ధైర్య” అనే పురస్కారాన్ని బహుకరించారు.
శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, చిత్తశుద్ధి, శ్రీ వారి కృప వలనే ఇంత చక్కని నాద బ్రహ్మోత్సవం జయప్రద మైనదని, ఇష్టమైన పనిని కష్టపడైనా చేస్తే నష్టపడేది లేదని చెప్పారు. నేచర్, కల్చర్, టుగెదర్ మేక్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ప్రకృతి భగవంతుని కానుక కావున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, సాంప్రదాయ వస్త్రధారణ, పిల్లలు పేర్లు, సినిమాలు మనలో స్ఫూర్తినింపేలా ఉండాలని తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచెప్పారు. అన్నమయ్య కీర్తనలు కోసం శోభారాజు గారి కృషి స్వామి వారి కృప మరియు ఆమె అకుంఠిత దీక్ష అని కొనియాడారు. అన్నమయ్య కీర్తనలను స్కూల్ సిలబస్ లోను, మా తెలుగు తల్లి లోను జోడించవలసిన అవసరం ఉందని దీనిపై ప్రభుత్వం వారికి తన విజ్ఞప్తి తెలియజేస్తామని చెప్పారు. అన్నమయ్య పాటల వలన సానుకూల నిర్మాణాత్మక భావము, ఆత్మ విశ్వాసం, ధైర్యం నింపుతాయని, “ఎండ కానీ, నీడ గానీ, ఏమైనా గానీ, కొండలరాయుడే మా కులదైవమూ” అనే సంకీర్తన ద్వారా వ్యక్తపరిచారు. మానవుల ప్రతీ సమస్యకు అన్నమయ్య పాటలో పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని, పాపాల్ని ఖండించాలంటే కావలసినది ఖడ్గమే కదా, అటువంటి శ్రీవారి నందకమనే ఖడ్గమైన అన్నమయ్య పాటల ద్వారా భావ కాలుష్యాన్ని ఖండించవచ్చని తెలిపారు.
శ్రీ జే. డి. లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ, ఒకే లక్ష్యం సాధించడానికి ప్రణాళిక ఎంత అవసరమో ఆచరణ కూడా అంతే ముఖ్యమని, అన్నమయ్య పాటలు జన బాహుళ్యానికి చేరేందుకు శోభారాజు గారి కృషి అభినందనీయం, అన్నమాచార్య భావనా వాహిని ద్వారా వారు చిన్నారులు నుండి భావి భారత పౌరులు వరకు మంచి విషయాలు నేర్పిస్తూ భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ (ట్యూనింగ్ సోసైటీ టు హార్మొనీ) సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని తెలియచేశారు. పిల్లలను ఉద్దేశించి తల్లి తండ్రులు మన వలన గర్వపడాలి, సంతకం ఒక ఆటోగ్రాఫ్ కావాలని, చదువుకునే పాఠశాలలోనే ముఖ్య అతిథిగా అయ్యేలా ఎదగాలని దిశా నిర్దేశం చేశారు.
చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.