Bhadrachalam: భద్రాద్రిలో కల్యాణ రాముడికి ఘనంగా మహాపట్టాభిషేకం

కల్యాణ రాముడిగా దర్శనమిచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి శ్రీరామనవమి (Sri Ram Navami) మరుసటి రోజు భద్రాద్రి (bhadrachalam)లో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవం (Pattabhishekam Ceremony) భక్తకోటి మదిని పులకింపజేసింది. శ్రీరామనామాలు మార్మోగుతుండగా మిథిలా మండపంలో రాములవారు పట్టాభిషిక్తులయ్యారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు సాగిన ఈవేడుక ఆద్యంతం భక్తులను ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. వేదమంత్రోచ్చారణల నడుమ సింహాసనాన్ని అధిష్టించిన రామచంద్రుడి వైభవాన్ని తిలకించి, భక్తులు తన్మయులయ్యారు.
మహోత్సవంలో భాగంగా భక్త రామదాసు (Bhakta Ramadasu) చేయించిన బంగారు ఆభరణాలను వేదపండితులు భక్తులకు చూపిస్తూ వాటి విశిష్టతను వివరిస్తూ దేవదేవుడికి అలంకరించారు. ఛత్ర, చామరాలు, పచ్చలపతకం, రామమాల, పాదుకలు, ఖడ్గం వంటి వాటిని అలంకరించారు. నదీ జలాలతో ప్రోక్షణ చేసి కిరీటాన్ని ధరింపజేయటంతో భక్తుల రామనామ ఘోష మిన్నంటింది. ప్రధానార్చకులు విజయరాఘవన్ (Vijayaraghavan), రామస్వరూప్, స్థానాచార్యులు, స్థలసాయి ఆధ్వర్యంలో సాగిన మహోత్సవం ఆద్యంతం భక్తిసుధలు పంచింది.