Srisailam Laddu: శ్రీశైలంలో లడ్డూ వివాదం.. ప్రసాదంలో బొద్దింక కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం (Srisailam) ఆలయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విజయవాడ (Vijayawada) నగరానికి చెందిన భక్తుడు తీసుకున్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక (cockroach) కనిపించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదికల మీద వేగంగా వైరల్ అయ్యింది. లడ్డూ తీసుకున్న సమయంలోనే బొద్దింకను గుర్తించిన భక్తుడు, వెంటనే అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా, వారు స్పందించి లడ్డూను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) మాట్లాడుతూ, నిజం ఏంటో తెలుసుకునేందుకు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజులు పరిశీలిస్తున్నామని, దీనిలో ఎవరైనా కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారా అన్న కోణంలోనూ పరిశీలన జరుగుతోందని వెల్లడించారు.
ఇక మరికొందరు భక్తుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటన బయటకు పోకుండా చేసేందుకు అధికారులు కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో తీసిన వారిపై కూడా ప్రభావం చూపేందుకు ప్రయత్నించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా భక్తుల్లో మరింత ఆందోళనను రేకెత్తించింది. శ్రీశైలం దేవాలయం రోజూ వేల మంది భక్తులు దర్శించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి ఆధ్యాత్మికత నిండిన ప్రాంగణంలో ప్రసాదం విషయంలో ఈ విధమైన ఘటన జరగడం తేలికపాటి విషయమే కాదు. లడ్డూ తయారీ సమయంలో పరిశుభ్రత పాటించడంలో లోపాలున్నాయా అన్న అనుమానాలు ప్రజలలో నెలకొంటున్నాయి.
ఇక ఈ సంఘటనపై భక్తులు అధికారుల నుండి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. బొద్దింక వాస్తవంగా ఉండడం చూసిన వారు ఉన్న నేపథ్యంలో ఇది అసత్య ప్రచారం అని నమ్మడం చాలా కష్టం. అధికారుల విచారణ అనంతరంగా దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రసాద తయారీలో నాణ్యత నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనpai ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్న విషయం కీలకంగా మారింది.