CBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు
తిరుపతిః తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నేటి సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) దంపతులతో కలిసి తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామిని కుటుంసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అనంతరం కుటుంబసమేతంగా మంత్రి నారా లోకేష్ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదపండితులు సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహనంపై ఆశీనులైన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అశోక్ సింఘాల్, ఇతర ఆలయ అధికారులు, టీటీడీ సభ్యులతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.