TTD : శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కి టీటీడీ భక్తి మార్గం..

తిరుమల శ్రీవారిని (Tirumala Srivari) దర్శించుకోవాలంటే ప్రతి భక్తుడికీ కల. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) అంటే ఎవరికి అక్కర్లేని కోరిక? కానీ సాధారణంగా అది సాధించాలంటే సిఫార్సు లేఖ కావాలి లేకపోతే భారీగా డబ్బులు ఖర్చు చేయాలి. అయితే ఇప్పుడు ఈ రెండింటి అవసరం లేకుండా టీటీడీ (TTD) ఇచ్చిన ఒక ప్రత్యేక అవకాశంతో వీఐపీ బ్రేక్ దర్శనం పొందవచ్చు. అయితే కాస్త కష్టమైన ఈ పని చేసేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ అవకాశం మాత్రం ఓ భక్తుడు తన ఓర్పు, శ్రద్ధ, భక్తితో శ్రీవారికి చేసిన ఆరాధనకి ఇచ్చే అనుగ్రహంగా చెప్పవచ్చు.
ఈ అవకాశం పొందాలంటే ఒకే ఒక్క షరతు ఉంది. గోవింద నామాన్ని (Govinda Namalu) 10,01,116 సార్లు రాయాలి. ఈ సంఖ్య అసాధ్యంగా అనిపించినా, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను, భక్తిని అర్థం చేసుకుంటే ఇది ఎంతో విశిష్టంగా మారుతుంది. ఒక్కసారి ఈ నామల సంఖ్య పూర్తయ్యాక, వ్రాసిన పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ (TTD Peshkar) కార్యాలయంలో సమర్పిస్తే, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. ఈ దర్శనంతో మీరు శ్రీవారిని మరింత సమీపంగా దర్శించుకునే భాగ్యం పొందుతారు.
ఈ నామల వ్రాత పూర్తిచేయాలంటే దాదాపు మూడేళ్ల సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్క పుస్తకంలో 39,600 గోవింద నామాలు రాసే అవకాశం ఉంటుంది. మొత్తం 10,01,116 నామాల కోసం 26 పుస్తకాలు అవసరం. ఈ పుస్తకాలు టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా కూడా ఆర్డర్ చేయొచ్చు. ఈ ప్రక్రియలో ఓర్పుతో పాటు నిజమైన భక్తి అవసరం.
ఇప్పటివరకు ఈ అవకాశాన్ని కేవలం ముగ్గురు మాత్రమే వినియోగించుకున్నారు. ఇందులో మొదటగా ఈ ప్రక్రియను పూర్తిచేసిన వారు బెంగళూరుకు చెందిన కీర్తన అనే యువతి. ఆమె ఇంటర్ పూర్తయ్యే సమయానికి ఈ భక్తి యాత్రను పూర్తి చేశారు. టీటీడీ ఆమెకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది.
ఇంత ప్రత్యేకమైన అవకాశం యువతకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ అవకాశానికి వయసు పరిమితి ఉంది – 25 ఏళ్ల లోపువారికే ఇది వర్తిస్తుంది. కనుక యువత దీన్ని ఓ ఛాలెంజ్ లా తీసుకుని, భక్తితో ముందుకు సాగితే శ్రీవారిని దగ్గరగా దర్శించే అపూర్వ అవకాశం దక్కుతుంది. ఇప్పుడు మీరూ ఆలస్యం చేయకుండా గోవింద నామాల వ్రాత ప్రారంభించండి. ఇది కేవలం దర్శనం కోసం కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా.