AP Ministers: ఎండలో భక్తులకు ఇబ్బందులు.. మంత్రుల ఆలయ సందర్శనలపై పెరుగుతున్న విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గం (AP Ministers) పని తీరుపై ఇటీవల వస్తున్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు, ఆయన ఇచ్చే ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రతిపక్షాల విమర్శ కాదు, నిజానికి పార్టీకి చెందిన కార్యకర్తలు, మీడియా వర్గాలే ఈ అంశాలపై నెగటివ్‌గా మాట్లాడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆలయాల సందర్శనల విషయంలో కొన్ని సూచనలు చేశారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఆలయాలకు వెళ్ళేప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆయన చెప్పినప్పటికీ, చాలామంది మంత్రులు ఆ సూచనలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తిరుమల(Tirumala ) వంటి ప్రదేశాలకు వరుసగా మంత్రులు వెళ్లడం వల్ల భక్తులకు దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ఉదాహరణకు, ఇటీవల విశాఖ జిల్లా (Visakha Zilla) సింహాద్రి అప్పన్న (Simhadri Appana) ఆలయంలో జరిగిన చందనోత్సవానికి ఒకేసారి నలుగురు మంత్రులు తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఈ ఉత్సవం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కాబట్టి భక్తుల రాక పెద్ద ఎత్తున ఉంటుంది. పైగా వేసవి సెలవులు ఉండటంతో చిన్నపిల్లలతో కుటుంబాలంతా దర్శనానికి వచ్చారు. దీంతో భక్తులు క్యూలైన్లలో ఎండలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా క్యూలైన్లకు తాళాలు వేసిన కారణంగా వారు బయటకు కూడా రావలేని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల వల్ల చంద్రబాబు చెబుతున్న సూత్రాలకు ఆయన మంత్రులు విలువ ఇవ్వడంలేదు అనే భావన ప్రజల్లో, పార్టీలో కొందరిలో ఏర్పడుతోంది. మంత్రులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సీఎం చెబుతున్నా పరిస్థితి మారడం లేదు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రి రోజా తరచూ తిరుమల దర్శనానికి వెళ్లేవారనే విమర్శలు ఉండేవి. ఇప్పుడేలా టీడీపీ హయాంలోనూ ఓ మహిళా మంత్రి అలానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని పొందాలంటే ప్రభుత్వం నిర్ణయాల్లో కఠినంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ లబ్ధి కోణంలో కాకుండా సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు వ్యవహరించాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న విమర్శలు చెబుతున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.