YS Jagan: వాట్ ఈజ్ దిస్ జగన్ గారూ…!?
దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court) మెట్లు ఎక్కారు. మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ అధినేతగా ఆయనకు ఉన్న ప్రజాదరణ అనన్యసామాన్యం అనడంలో సందేహం లేదు. కానీ, ఒక అవినీతి ఆరోపణల కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో జరిగిన హంగామా, కార్యకర్తల అత్యుత్సాహం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. బేగంపేట ఎయిర్పోర్ట్ (Begumpet Airport) నుండి లోటస్ పాండ్ (Lotus Pond) వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఇది కోర్టు విచారణా లేక ఎన్నికల విజయోత్సవ ర్యాలీనా అనే సందేహం కలగకమానదు.
జగన్ రాకతో బేగంపేట విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అభిమానులు భద్రతా వలయాలను, బారికేడ్లను తోసుకుని మరీ రన్ వే వైపు చొచ్చుకెళ్లడం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపింది. అక్కడితో ఆగకుండా ఎయిర్పోర్ట్ నుండి నాంపల్లి కోర్టు వరకు, ఆ తర్వాత లోటస్ పాండ్ నివాసం వరకు బైక్ ర్యాలీలు, కాన్వాయ్ ముందు విన్యాసాలు చేయడం ట్రాఫిక్ ఆంక్షలను, చట్టాన్ని అపహస్యం చేసినట్లయింది. చేతిలో రప్పా రప్పా వంటి సినిమా డైలాగుల ప్లకార్డులు ప్రదర్శిస్తూ, సీఎం.. సీఎం అని అరవడం చూస్తుంటే.. సందర్భం ఏదైనా సరే, హడావుడి చేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు పనిచేశాయా అనిపించక మానదు. చివరకు లోటస్ పాండ్ వద్ద పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి రావడం ఈ అతికి పరాకాష్ట.
జగన్ పై అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ, ఆయన వెళ్తున్నది ఏదైనా ప్రజా సమస్యపై పోరాటానికో, లేక ఎన్నికల ప్రచారానికో కాదు. తీవ్రమైన ఆర్థిక నేరారోపణల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మౌనంగా, హుందాగా వ్యవహరించడం కనీస బాధ్యత. గతంలో అమిత్ షా, ఎల్.కె.అద్వానీ, జయలలిత వంటి రాజకీయ దిగ్గజాలే కాకుండా.. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి సినీ ప్రముఖులు కూడా కోర్టుల మెట్లు ఎక్కారు. కానీ ఎవరూ ఇలాంటి బలప్రదర్శన చేయలేదు. చట్టం ముందు అందరూ సమానమే అనే స్పృహతో వ్యవహరించారు. కానీ జగన్ విషయంలో మాత్రం పరామర్శకైనా, కోర్టుకైనా ఒకే రకమైన జాతర వాతావరణం సృష్టించడం విడ్డూరంగా ఉంది.
ఈ హడావుడి వెనుక వైసీపీ వ్యూహం ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కోర్టుల తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో హాజరుకాక తప్పని పరిస్థితి జగన్‌ది. అయితే, ఈ జనసందోహాన్ని, ట్రాఫిక్ జామ్‌లను, భద్రతా సమస్యలను సాకుగా చూపి.. భవిష్యత్తులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరేందుకే ఈ షో నడిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. “చూశారుగా.. నేను వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది” అని కోర్టుకు నివేదించడానికి ఈ సీన్ క్రియేట్ చేశారనేది విశ్లేషకుల మాట.
తమ నాయకుడి కోసం ఇంతమంది వచ్చారు అని వైసీపీ హైకమాండ్ సంబరపడవచ్చు. కానీ, ఇలాంటి చర్యలను తటస్థ ఓటర్లు, సామాన్య ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఎన్నికలకు ముందు కూడా వైసీపీ సభలకు జనం పోటెత్తారు. కానీ ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. కార్యకర్తల ఈలలు, గోలలు ఓట్లుగా మారవని ఆ ఫలితాలు స్పష్టం చేశాయి. ఒక పార్టీగా, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడినప్పుడు ఇలాంటి మద్దతు లభిస్తే అది బలం. కానీ, కోర్టు కేసుల విచారణ సమయంలో చేసే ఈ ఆర్భాటాలు “చట్టం అంటే లెక్కలేదు” అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపే ప్రమాదం ఉంది. ఎక్కడ తగ్గాలి.. ఎక్కడ నెగ్గాలి అనే విచక్షణ కోల్పోతే, అది పార్టీ ప్రతిష్టకే కాదు, భవిష్యత్తు రాజకీయాలకు కూడా చేటు తెస్తుంది. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం తమ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయకపోతే, ఈ అతి అభిమానమే పార్టీకి గుదిబండగా మారే అవకాశం లేకపోలేదు.






